ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 5,654 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి అంతే స్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు.
నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇది వరకే మూడు పీజీ సీట్లు వచ్చాయని, తాజాగా నాలుగు పెంచడంతో ఏడు సీట్లకు పెరిగినట్లు వివరించారు. డెర్మటాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. వైస్ ప్రిన్సిపాళ్లు జలగం తిరుపతి రావు, డాక్టర్ నాగమోహన్ , డాక్టర్ కిశోర్, హెచ్‌వోడీలు, ఫ్యాకల్టీ, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు సిబ్బంది, సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు శనివారం రాత్రి 10 గంటల వరకు 422 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ భాస్కర్‌రావ్ తెలిపారు. ఈ నెల 23న లక్కీడ్రా నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని సీఐ వెల్లడించారు.
రాజంపేట: మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని గుట్ట నుంచి మొరం అక్రమ రవాణా చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మొరం రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద


