182 సార్లు కాశీ యాత్ర...2 సార్లు చార్‌ధామ్ యాత్ర
● 2002 నుంచి పర్యటిస్తున్న కామారెడ్డి వాసి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లికి చెందిన నీలం వెంకటి ఇప్పటికి 182 సార్లు కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. కాశీలో ఒక్కోసారి వారం రోజుల పాటు ఉండి గంగస్నానం చేశారు. దేవునిపల్లి శివాలయంలో 2002లో శివదీక్షలు ప్రారంభించినపుడు అర్చకులు మశ్చేందర్‌ప్రసాద్ దేశ్‌పాండేతో కలిసి దీక్ష పరులందరితో కలిసి కాశీ వెళ్లినట్టు వెంకటి వివరించారు. అర్చకులు మశ్చేందర్‌ప్రసాద్ ఇప్పటికి 108 సార్లు కాశీకి భక్తులను తీసుకుపోయి గంగాతీరంలో పశుపత రుద్రయాగాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివమాల ధరించడం, డ్రైవింగ్ బాగా రావడం, కామారెడ్డి నుంచి కాశీ, అయోధ్య వరకు అన్ని దగ్గరి దారులు తెలియడంతో పాటు కాశీలో పలువురితో పరిచయాలు ఉండడంతో కాశీలో తక్కువ వ్యయంతో బస చేయడానికి ఇబ్బందులు పడకుండా ఇక్కడి భక్త బృందాలు వెంకటిని వెంట తీసుకుపోతున్నారు. అలాగే 13 శక్తిపీఠాలు దర్శించడంతో పాటు తిరుమల వేంకటేశ్వరుడిని 100 సార్లు దర్శించుకున్నట్టు, అనేక సార్లు రామేశ్వరం, సోమనాథ్, రెండు సార్లు చార్‌ధామ్ యాత్ర చేశారు. తనకు శక్తి ఉన్నంత వరకు కాశీయాత్ర చేస్తూనే ఉంటానని నీలం వెంకటి వెల్లడించారు.
182 సార్లు కాశీ యాత్ర...2 సార్లు చార్‌ధామ్ యాత్ర


