స్పెషల్ డ్రైవ్‌లో 164 సెల్‌ఫోన్ల రికవరీ
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి క్రైం: ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళనకు గురికావొద్దని, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 164 సెల్‌ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సీఈఐఆర్ విధానంతో సెల్‌ఫోన్ రికవరీ చేసేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో 15 రోజుల క్రితం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 164 సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,579 సెల్‌ఫోన్లు, సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,026 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. వాటి విలువ దాదాపు రూ.6.45 కోట్ల వరకు ఉంటుందన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్‌ఎస్సై బాల్‌రాజు (87126 86114)ను సంప్రదించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు.


