క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరి మృతి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన బేగంపూర్ గ్రామ శివారులోని కింద చెరువులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన పిసుకే నడిపి సాయిలు (50)కు గతంలోనే వివాహం జరుగగా, భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. తరచుగా తమ్ముడి ఇంటికి వెళ్లివస్తుండేవాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం సీతాఫలాలను తీసుకురావడానికి తమ్ముడి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా, ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం బేగంపూర్ గ్రామ శివారులోని కింది చెరువులో అతడి మృతదేహం లభ్యమైంది. సాయిలుకు గత కొన్నిరోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. చెరువు కట్ట పైనుంచి అతడు నడుచుకుంటు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి, ఈతరాక మృతిచెందినట్లు మృతుడి తమ్ముడు లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర సమీపంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూర్ జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు(16)అనే బాలుడు తన తల్లి ముంతాజ్‌తోపాటు గ్రామానికి చెందిన మరికొంత మందితో కలిసి బాతులను మేపేందుకు ఈనెల 12న మండలానికి వచ్చారు. కాగా శుక్రవారం ఉదయం మండలంలోని నాగిరెడ్డిపేట శివారులో బాతుల మంద నుంచి కొన్ని బాతులు విడిపోయి పక్కకు పోతుండగా చోటు వాటిని మందలోకి తోలుతున్నాడు. ఈక్రమంలో పొలంలోని స్టార్టర్‌బాక్స్ వద్ద ఉన్న కరెంట్‌వైరుకు అతడు తగిలి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మండలకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు.
నిజాంసాగర్(జుక్కల్): అచ్చంపేట గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి పేకాడుతున్న ముగ్గురిని పట్టుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,390 నగదు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని వివరించారు.
క్రైం కార్నర్


