ఎక్కడి వడ్లు అక్కడే
బీబీపేట: ఈ ఏడాది జిల్లా అంతటా భారీ వర్షాలు కురవడం ఆశించిన మేర పంటలు పండడంతో నెల రోజుల ముందే పంట చేతికి వచ్చింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లను రైతులు తీసుకువచ్చారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కేంద్రం వద్ద కూడా వడ్లను కొనడం ప్రారంభించలేదు. దీంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో మాదిరిగా వాతావరణం ఉండడంతో రైతులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఒకరోజు ఉక్కపోత, మరో రోజు మేఘాలు కమ్మడంతో రైతులకు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ పరిధిలో 6 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ పరిధిలో 5 కేంద్రాలు ఉండగా ఎక్కడా కూడా వడ్లను కొనడం లేదు. ఇప్పటికే కేంద్రాల వద్దకు వడ్లు చేరడంతో పాటు రైతులు ఆరబెడుతున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో 11 కేంద్రాల్లో 1,51,658 క్వింటాళ్లు వడ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇంకా ఎక్కువగానే వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అధికారులు త్వరితగతిన కొనుగోళ్లు చేపడితే తప్ప రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
● కేంద్రాలు ప్రారంభమైనా
కొనుగోలు చేయని వడ్లు
● వాతావరణంలో మార్పులతో
రైతుల దిగులు


