శాంతించిన మంజీర
● ‘సాగర్’కు తగ్గిన వరద
● మూసుకున్న ఫ్లడ్ గేట్లు
నిజాంసాగర్(జుక్కల్): రెండు నెలలుగా వరద ప్రవాహంతో ఉరకలేసిన మంజీర నది శాంతించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గు ముఖపట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నెల వరకు ప్రాజెక్టులోకి 290.275 టీఎంసీల ఇన్‌ఫ్లోగా వచ్చింది. ఆగస్టు 18న ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తగా అప్పటి నుంచి 53 రోజులపాటు 270.990 టీఎంసీల నీటిని మంజీరలోకి విడుదల చేశారు. వంద సంవత్సరాల ప్రాజెక్టు చరిత్రలో 290.275 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి అని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
నిలకడగా నీటిమట్టం
ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1405 అడుగుల (17.8టీఎంసీల) నీరు నిల్వ ఉంది.


