ఇస్రోజీవాడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి
కామారెడ్డి రూరల్: ఇస్రోజీవాడి గ్రామానికి ఆర్టీసీ బస్సు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామానికి బస్సు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం గ్రామ యువకులు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు సకాలంలో చేరడం లేదని పేర్కొన్నారు. కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ అధిక ధరలు చెల్లించాల్సి వస్తుండగా, ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో లేక ఇటు గర్గుల్‌కు, పోసానిపేట రోడ్డు వరకు నడిచి వెళ్లే పరిస్థితి నెలకొందని తెలిపారు. సమస్య అర్థం చేసుకొని బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. యువకులు కొత్తపల్లి రాజు, సురేష్, ప్రశాంత్, అరవింద్, బన్నీ తదితరులు ఉన్నారు.


