ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాక్లూర్: చదువులో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతో మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన దీమర వెంకట్(16) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. చిక్లీ గ్రామానికి చెందిన దీమర సాయిరెడ్డి, మంజుల కుమారుడు వెంకట్ డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చదువులో నెలవారీగా నిర్వహించే కామన్ పరీక్షలలో తోటి స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయన్న బాధతో ఉండేవాడని తెలిపారు. దీపావళి పండుగ కోసం నాలుగు రోజుల ముందే చిక్లీకి వచ్చాడు. గురువారం వెంకట్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


