21 నుంచి పోలీస్ అమరుల వారోత్సవ పోటీలు
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల వివరాలు
ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 31 వరకు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారన్నారు.
ఫొటో, షార్ట్ ఫిలిం పోటీలు..
అలాగే ఫోటో, షార్ట్ ఫిలిం పోటీలు కూడా నిర్వహించనున్నామని, విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొనవచ్చన్నారు. పోలీసులు చేసిన సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవ వంటి అంశాలపై 3 నిమిషాల లోపు షార్ట్ ఫిల్మ్‌లు లేదా సమాజంలో పోలీసుల ప్రతిష్ఠను పెంపొందించే ఫొటోలు రూపొందించి అక్టోబర్ 23లోపు కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫొటోలు(ప్రింట్ లేదా డిజిటల్), షార్ట్ ఫిల్మ్‌లు(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన మూడు ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు ప్రదానం చేస్తామని, వీరిలో ఉత్తములను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని, యువత, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని, పోలీస్ అమల త్యాగాలకు నివాళులర్పించాలని ఎస్పీ కోరారు.
విద్యార్థులకు పోటీలు..
ఈ సందర్భంగా జిల్లాలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. అక్టోబర్ 21 నుండి 28 వరకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర–విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలి అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులు https:// forms. gle/ jaWLdt2 yhNrMp e3 eఅ లో లాగిన్ అయి పేరు, విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయాలన్నారు. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని ఫొటో లేదా పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలన్నారు. వ్యాసరచనలో గరిష్టంగా 500 పదాలు మాత్రమే ఉండాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతులతో సత్కరించి, రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
20న బ్యానర్లు, హోర్డింగుల ఏర్పాటు
21న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయం 8 గంటలకు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం
22న కామారెడ్డి, 24న ఎల్లారెడ్డి, 25న బాన్సువాడ డివిజన్లలో అమరవీరుల కుటుంబాలకు పరామర్శ
25న సైకిల్ ర్యాలీ
27న కామారెడ్డి, 28న ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనన్‌లలో ప్రజా అవసరాల సేకరణ
29న పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం
30న ఓపెన్ హౌస్ కార్యక్రమం
31న క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం


