పౌష్టికాహారం తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తినే ఆహారంలో చక్కెర, ఆయిల్, ఉప్పు స్థాయిలను తగ్గించాలని సూచించారు. అంగన్‌వాడీల్లో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం రెగ్యులర్‌గా అందిస్తూ దేశాన్ని ఎనీమియా రహిత భారత్‌గా మార్చాలని సూచించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నపాసన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యలక్ష్మిలో రెగ్యులర్ అటెన్‌డెన్స్ ఉన్న గర్భిణులకు, నార్మల్ డెలివరీ అయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న మహిళలు, చిన్నారులకు బహుమతులు అందజేశారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రాం ఆఫీసర్ యమిమ, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


