సమయపాలన పాటించని అధికారులపై చర్యలు
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
నిజాంసాగర్(జుక్కల్): సమయపాలన పాటించని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. బుధవారం మహమ్మద్‌నగర్ మండల తహసీల్ కార్యాలయంలో ఎన్‌హెచ్–765డి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల సమావేశానికి సబ్ కలెక్టర్ వచ్చారు. తహసీల్ కార్యాలయం అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానాను సందర్శించారు. పల్లె దవాఖానా వైద్యురాలితో పాటు ఏఎన్‌ఎం విధులకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె దవాఖానాలో నెల రోజుల నుంచి రోగుల రిజిష్టర్ నిర్వహణ చేపట్టకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సబ్‌కలెక్టర్ ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ లత, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, గిర్దావర్ పండరి తదితరులున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యం చేరుకోవాలి
నిజాంసాగర్(జుక్కల్): గ్రామ పంచాయతీల వారిగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం మహమ్మద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. ఇళ్ల నిర్మించుకునే ఉద్దేశం లేకుంటే రద్దు చేసి కొత్తవారికి ఇళ్లు మంజూరు చేయించాలని సూచించారు. అలాగే ఎన్‌హెచ్–765డి రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని రైతులకు సూచించారు. పట్టాదారు పాసుబుక్కులు ఉంటే నష్ట పరిహారం అందుతుందన్నారు. శిఖం, అసైన్డ్, భూములు ఉన్న రైతులకు పరిహారం రావడం కష్టమన్నారు. తహసీల్దార్ లత, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, గిర్దావర్ పండరి తదితరులున్నారు.


