డీసీసీ పదవికి పెరిగిన పోటీ!
మరికొందరి ఆసక్తి...
● ఇప్పటికే పది మందికి పైగా దరఖాస్తు
● మరికొందరు దరఖాస్తు
చేసుకునేందుకు సన్నద్ధం
● ఎవరి ప్రయత్నాల్లో వారు...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత పట్టణానికి చెందిన సీనియర్ నేత కై లాస్ శ్రీనివాస్‌రావ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డీసీసీ కొత్త కార్యవర్గాల నియామకానికి పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఏఐసీసీ పరిశీలకులు రాజ్‌పాల్ కరోలా ఆధ్వర్యంలో ని యోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నా రు. తొలుత జిల్లా నాయకులతో జిల్లాస్థాయి సమా వేశం కామారెడ్డిలో జరిగింది. తర్వాత కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమావేశాలు మంగళ, బుధవారాల్లో పూర్తయ్యాయి. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సమావేశాలు కూడా గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అయితే, జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పది మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన పంపరి శ్రీనివాస్, కామారెడ్డి మండలానికి చెందిన నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డిలు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. సదాశివనగర్ మండలానికి చెందిన లింగాగౌడ్, రా మారెడ్డి మండలానికి చెందిన గీరెడ్డి మహేందర్‌రెడ్డి, నారెడ్డి మోహన్‌రెడ్డి, గాంధారికి చెందిన ఆకుల శ్రీనివాస్, నిజాంసాగర్‌కు చెందిన మల్లికార్జున్ తదితరు లు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ తన ప్రధాన అనుచరుడు, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గ సమావేశంలో అందరూ కలిసి ఆయన పేరును ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారిని తిరిగి నియమించకపోవచ్చని అంటున్నారు. దీంతో కై లాస్ శ్రీనివాస్‌రావ్ పదవిపై డైలామా నెలకొంది. ఆయనను కాదంటే షబ్బీర్ అలీ ఎవరి పేరును సూచిస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు తన అనుచరుడు లింగాగౌడ్‌కు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని రామారెడ్డి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తన అనుచరుడు మల్లికార్జున్‌కు ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తమ అనుచరులను రంగంలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. గాంధారి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కామారెడ్డి మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న సీనియర్ నేత పంపరి శ్రీనివాస్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు వెల్లడించడంతో మరికొందరు నేతలు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి మరికొందరు నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడుతున్న నేతలు ఎన్నికలు వాయిదా పడడంతో డీసీసీ పదవికి ఓ దరఖాస్తు పెడితేపోలా అనే ఆలోచనలో ఉన్నారు. నామినేటెడ్ పదవులు రానివాళ్లంతా డీసీసీ పదవులపై కన్నేశారు. దీంతో పోటీ పెరిగే అవకాశం ఉంది.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి అంటే పార్టీ పరంగా ప్రోటోకాల్ ఉంటుందనే భావనతో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ గాడ్‌ఫాదర్లతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


