మిగిలింది మూడు రోజులే..
● ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 267
● మద్యం దందాపై ఆసక్తి తగ్గిందా!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న అధికారులు డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. అయితే దరఖాస్తులు చేసుకునే గడువు మూడు రోజులే మిగిలి ఉండగా 49 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు కేవలం 267 మాత్రమే. దసరా తర్వాత దరఖాస్తులు వెల్లువలా వస్తాయని అనుకున్నా, ఆ స్థాయిలో రావడం లేదు. శుభ ముహూర్తాలు వచ్చినా దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరగడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 267 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హన్మంతరావ్ ‘సాక్షి’కి తెలిపారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 దుకాణాలకు 63, దోమకొండ పరిధిలోని 8 దుకాణాలకు 44, ఎల్లారెడ్డి పరిధిలోని 7 దుకాణాలకు 41, బాన్సువాడ పరిధిలోని 9 వైన్సులకు 59, బిచ్కుంద పరిధిలోని 10 దుకాణాలకు 60 దరఖాస్తులు వచ్చాయి.
గతంలో పోటీ..
జిల్లాలో మద్యం దుకాణాలకు రెండేళ్లకోసారి నిర్వహించే కేటాయింపు దరఖాస్తులకు గతంలో పెద్ద ఎత్తున పోటీ ఉండేది. 2021–23 సంవత్సరాలకు 49 మద్యం దుకాణాలకు 960 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.19.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2023–25 సంవత్సరాలకు 49 మద్యం దుకాణాలకు 2,204 దరఖాస్తుల ద్వారా రూ.44.08 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి కూడా మద్యం దుకాణాలు అంతే ఉండగా, గతంలో కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 267 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 18తో అంటే మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. ఆఖరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


