మన చేతుల్లోనే ఆరోగ్యం
సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించాలి
● తినేముందు చేతులు శుభ్రంగా
కడుక్కుంటేనే ఎంతో మేలు
● నేడు గ్లోబల్ హ్యాండ్ వాష్‌డే
కమ్మర్‌పల్లి: మనం ఏం తిన్నామో కాదు, ఎలా తిన్నామో అనేదే ముఖ్యం. భోజనం తినడానికి ముందు, బాత్‌రూమ్ వెళ్లివచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతో మేలు. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఏటా అక్టోబరు 15న విశ్వవ్యాప్తంగా చేతుల పరిశుభ్రత దినోత్సవం(గ్లోబల్ హ్యాండ్ వాష్ డే)గా పాటిస్తున్నారు.
శుభ్రంగా లేకుంటే..
మనిషి ఆరోగ్యం శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మురికిగా ఉన్న చేతులతో భోజనం చేస్తే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి జబ్బులు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేస్తుంటాము. ఈక్రమంలో మనం తాకిన ప్రతి వస్తువులపైన కనిపించని క్రిములుంటాయి. ఆయా వస్తువులను తాకినపుడు మన చేతికి అంటుకొంటాయి. చేతుల్లో కంటికి కనిపించని వైరస్‌లు లక్షల్లో దాగిఉంటాయి. అవే చేతులను కళ్లు, నోరు, ముక్కు దగ్గర పెట్టినపుడు బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి చేరుతుంది. చేతులను నీటితో శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకుంటే చేతుల్లోని క్రిములు నోటిద్వారా శరీరంలోకి చేరుతాయి.
అవగాహన కల్పించాలి..
చేతుల శుభ్రతపై పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండటంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడంవల్ల అనేక రోగాల్ని చేతులతో ఆహ్వానించినట్టే. తరచు చేతులు శుభ్రం చేసుకోవడంవల్ల 80 శాతం రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. అందుకే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆహారం తీసుకునేముందు సబ్బు లేదా యాంటీ బాక్టీరియల్ లోషన్, సానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి.


