వడ్ల పొట్టుకు భలే డిమాండ్
బీబీపేట: ఇటుక బట్టీలు, హోటళ్లు, కోళ్ల ఫారాలు ఇలా అనేక వాటిలో వడ్ల పొట్టును వాడాల్సిందే. అయితే ప్రస్తుతం వడ్ల పొట్టు లేకపోవడం, ఉన్న కాస్త పొట్టు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో స్థానికంగా కొరత ఏర్పడుతోంది. దీనికి తోడు వర్షాకాలం సీజన్‌లో రావాల్సిన వడ్లు ఇంకా రైస్ మిల్లులకు చేరకపోవడంతో రైస్ మిల్లులు నడవడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న కొంత ఊకను సైతం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
స్థానికంగా కోళ్ల ఫారాలు..
బీబీపేట మండలంలో సుమారు 2 లక్షలకు పైగా కోళ్లను పెంచే సామర్థ్యం ఉన్న ఫారాలు ఉన్నాయి. 2 లక్షల కోళ్లను పెంచేందుకు సుమారు 60 టన్నుల వడ్లపొట్టు అవసరమవుతుంది. ప్రతి రెండు నెలలకోసారి 60 టన్నుల ఊక అవసరం ఏర్పడడంతో స్థానికంగా కొరత ఏర్పడుతోంది. పది వేల కోళ్లు ఉండే ఫామ్‌కి సుమారు 3 టన్నుల కన్నా ఎక్కువే ఊక అవసరం పడుతుంది. ఒక కోళ్ల ఫామ్ రైతు ప్రతి రెండు నెలలకోసారి ఊకను తీసుకుపోవాల్సిన వస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు రావడంతో వారికి విక్రయిస్తున్నారు. అలాగే చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు ఊక అవసరం ఉంటోంది.
రైస్ మిల్లులు పూర్తిగా నడవకపోవడంతో ప్రస్తుతం ఊకకు డిమాండ్ పెరిగింది. ఒక్కో రైస్ మిల్లు రోజంతా నడిస్తే సుమారు 3 నుంచి నాలుగు టన్నుల ఊక మాత్రమే వస్తుంది. అది ఒక లారీ నింపడానికి కూడా సరిపోవడం లేదు. రెండు రోజులు నడిస్తే తప్ప లారీ నిండే అవకాశం లేదు. అలాగే వడ్ల పొట్టు తక్కువగా ఉండడంతో ధర కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం రూ. 4 వేల నుండి రూ. 5 వేల వరకు ఒక టన్నుకు అమ్ముతున్నారు. ఒక్కోసారి ఊక కొరత ఉండడంతో రూ. 6 వేల వరకు ధర పెరుగుతోంది. దీంతో కోళ్ల ఫారాల రైతులపై ఆర్థికభారం పడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం స్థానికులపై పడుతోంది.
ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలకు
వడ్ల ఊకే ఆధారం
రైస్ మిల్లులు నడవక వడ్ల పొట్టు కొరత
భారీ వాహనాల్లో ఇతర
రాష్ట్రాలకు ఎగుమతి
స్థానికంగా కొరతతో ఇబ్బందులు


