పోచారం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద
● రెండునెలలుగా కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
● గతంలో ఎన్నడూలేని విధంగా
ఈ ఏడాది 28 టీఎంసీల వరద
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నిజాంకాలంలో అప్పటి ప్రభువు మండలంలోని ఆలేరువాగుపై నిర్మించిన పోచారం ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద వచ్చింది. సుమారు 103 ఏళ్ల క్రితమే పోచారం ప్రాజెక్టును 70 వేల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ చేసి నిర్మించారు. కానీ ఈ ఏడాది కురిసిన భారీవర్షాల కారణంగా లక్షా 82వేల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడింది. ఈ ఏడాది కురిసిన భారీవర్షాలతో ఆయకట్టు కింద వానాకాలం పంటలసాగు మొదలైనప్పటి నుంచి పంటలు కోతదశకు చేరే వరకు సుమారు రెండునెలలుగా ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు వరద నీరు ప్రవహిస్తూనే ఉంది.
మంజీరలోకి 26 టీఎంసీలు..
పోచారంప్రాజెక్టు అలుగు పైనుంచి వరద దిగువకు ప్రవహిస్తూ 26 టీఎంసీల నీరు పోచారం పెద్దవాగు ద్వారా మంజీరలోకి చేరింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద నీరు అవుట్ ఫ్లోగా వెళ్లలేదు. 1917–22 మధ్యకాలంలో అప్పటి నిజాం ప్రభువు అలీ నవాబ్ జంగ్ బహదూర్ 27.11లక్షలు వెచ్చించి 2.423 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా ఆలేరు వాగుపై 1.7 కిలోమీటర్ల పొడువుతో, 21అడుగుల ఎత్తుతో పోచారం ప్రాజెక్టును నిర్మించారు. దీంతోపాటు ప్రాజెక్టులోని నీరు గేట్ల ద్వారా ఆయకట్టుకు చేరేలా 58 కిలోమీటర్ల పొడువుతో ప్రధానకాలువను నిర్మించారు. కాలువకు 73 డిస్ట్రిబ్యూటరీలను నిర్మించారు. 103 ఏళ్లలో ఎన్నడు కూడా ఈ స్థాయిలో ఇన్‌ఫ్లోగా రాలేదు. ఈ ఏడాది ప్రాజెక్టు ఎగువన కురిసిన భారీవర్షాల కారణంగా 28.020 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లోగా రాగా 25.933క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా దిగువకు వెళ్లింది. కాగా ఈ ఏడాది ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటలసాగు కోసం ప్రాజెక్టు నుంచి కేవలం 0.172 టీఎంసీల నీటిని అధికారులు ప్రధా న కాలువలోకి విడుదల చేశారు. పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తూ గత ఆగస్టు 16న 12 వేల క్యూసెక్కులతో మొదలైన అవుట్ ఫ్లో నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అలుగుపై నుంచి 742 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.


