వివాదాస్పదమైన నీటికుండీ తొలగింపు
భిక్కనూరు: గ్రామస్తులు నిర్మించిన నీటి కుండీ తన తన ఇంటి ముందు ఉందని ఓ వ్యక్తి దాన్ని తొలగించాడు. దీంతో గ్రామస్తులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయగా సదరు వ్యక్తి నీటిట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన మండలంలోని గుర్జకుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కుంట ప్రభాకర్‌రెడ్డి ఆరు నెలల క్రితం 450 గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ స్థలం ముందు 30 ఏళ్ల క్రితం గ్రామస్తులు పశువుల కోసం నిర్మించిన నీటికుండీ ఉంది. ఆ కుండీని ప్రభాకర్‌రెడ్డి కొన్ని నెలల క్రితం తొలగించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్టోబర్ 10వ తేదీ నాటికి కుండీని యథాస్థానంలో తిరిగి నిర్మిస్తానని అతడు గ్రామస్తులకు తెలుపడంతో వారు శాంతించారు. అయితే గడువు దాటినా కుండీ నిర్మించలేదని ప్రభాకర్‌రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. తామే నిర్మిస్తామని మంగళవారం పనులు ప్రారంభించడంతో ప్రభాకర్‌రెడ్డి గుళికల మందు తీసుకుని సమీపంలోని వాటర్‌ట్యాంక్ ఎక్కాడు. పనులు నిలిపివేయకుంటే గుళికలు మింగుతానని హెచ్చరించాడు. దీంతో గ్రామస్తులు పనులు నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై ఆంజనేయులు గ్రామానికి చేరుకుని ఫోన్‌లో ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడి సముదాయించాడు. పలువురు గ్రామస్తులు వాటర్ ట్యాంక్ మీదకు చేరుకుని ప్రభాకర్‌రెడ్డిని కిందికి తీసుకుని వస్తుండగా కొన్ని గుళికలను ప్రభాకర్‌రెడ్డి నోట్లో వేసుకున్నాడు. పక్కనే ఉన్న వారు అతడిని కిందకు తీసుకురాగా, వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సై కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రభాకర్‌రెడ్డి వాటర్ ట్యాంక్‌లో గుళికలు కలిపి ఉండొచ్చనే అనుమానంతో నీటిని ఖాళీ చేయించి ట్యాంకును శుభ్రం చేయించారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి
హల్‌చల్ చేసిన వ్యక్తి
భిక్కనూరు మండలం
గుర్జకుంటలో ఘటన


