పూడికతీతకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

పూడికతీతకు మోక్షం

Jul 5 2025 6:36 AM | Updated on Jul 5 2025 6:36 AM

పూడిక

పూడికతీతకు మోక్షం

పోచారం ప్రధానకాలువలో పనులకు

రూ.40 లక్షల నిధులు మంజూరు

పూర్తయిన టెండర్‌ ప్రక్రియ

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానకాలువలో పూడికతీత, పొదల తొలగింపుతోపాటు కాలువకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పొదల తొలగింపునకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా ప్రధాన కాలువలో పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి చివరి ఆయకట్టుకు నీరు చేరేందుకు ఎన్నో ఇబ్బందులు కలిగేవి. దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడికను, కాలువకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలను తొలగించాలని స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో అధికారులు ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కింద రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. పనులకు సంబంధించి ఇటీవల అధికారులు టెండర్‌ ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే కాలువలో పూడికతీత పనులు చేపట్టనున్నారు.

నిధుల మంజూరులో ఆలస్యం..

పోచారం ప్రధాన కాలువలో పూడికతీత, చెట్ల తొలగింపు పనులకు నిధుల మంజూరులో ఆలస్యమయింది. ఇటీవల రబీ పంటలసాగు పూర్తయ్యేనాటికి నిధులు మంజూరై, టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యుంటే వేసవిలో కాలువ మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలుగా ఉండేది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవడంతోపాటు ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల కాలువ మరమ్మతు పనులకు ఆటంకం కలుగనుంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

నీరందేలా చేయాలి

పోచారం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టుకు అందడంలేదు. ప్రధానకాలువలో దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీరు చివరి ఆయకట్టు వరకు చేరడానికి చాలా సమయం పడుతోంది. ప్రధానకాలువలో పెరిగిన చెట్లను, పూడికను తీసేస్తే నీరు సకాలంలో చేరుతుంది. కాలువలో పెరిగిన చెట్లకొమ్మలను తొలగించడంపై అధికారులు దృష్టి సారించాలి.

– పట్లోళ్ల భాగయ్య, రైతు, ఆజామాబాద్‌, ఎల్లారెడ్డి

చాలా ఇబ్బందవుతుంది

పోచారం గ్రామశివారులో ప్రధానకాలువ పక్కన ఉన్న నా పొలానికి వెళ్లాలంటే కాలువ కట్ట వెంట పోవాలి. కాలువ కట్టకు ఇరువైపులా దట్టంగా తుమ్మ చెట్లు పెరిగాయి. పొలానికి వెళ్తుంటే చెట్ల కొమ్మలు కళ్లకు తగులుతున్నాయి. వాటిని తొలగించాలని అధికారులకు విన్నవించాం. నిధులు మంజూరయ్యాయని తెలిసింది. అధికారులు స్పందించి చెట్లకొమ్మలను తొలగించాలి.

– రాజు, రైతు, పోచారం, నాగిరెడ్డిపేట

పూడికతీతకు మోక్షం1
1/3

పూడికతీతకు మోక్షం

పూడికతీతకు మోక్షం2
2/3

పూడికతీతకు మోక్షం

పూడికతీతకు మోక్షం3
3/3

పూడికతీతకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement