సామర్లకోట: ‘‘మాలో సగం మంది నిరక్షరాస్యులే.. అధిక శాతం కౌలు చేస్తున్న వాళ్లే.. స్మార్ట్ ఫోన్లపై మాలో చాలా మందికి అవగాహలేదు. అటువంటి మాకు అవసరమైన మొబైల్ యాప్ ద్వారానే ఎరువులు ఇస్తామనడమేమిటి? ఈ ‘యాప్’సోపాలు మావల్ల కాదు. ఇదే విధానం కొనసాగిస్తే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్స్ సేల్స్’ పేరిట ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. శాస్త్రవేత్తలు సూచించినప్పుడు వారు చెప్పిన పరిమాణంలో ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు సరఫరా చేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉన్నారు. పలువురు నారుమళ్లు, దమ్ముల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఎరువుల యాప్‌పై అవగాహన పెంచుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తోంది. సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు సామర్లకోటలో రోడ్డెక్కారు. యాప్ ద్వారా ఎరువుల విక్రయానికి వ్యతిరేకంగా సామర్లకోటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) వద్ద గురువారం ధర్నా చేశారు. అక్కడి నుంచి నీలమ్మ చెరువు, మఠం సెంటర్ మీదుగా స్థానిక స్టేషన్ సెంటర్‌లోని గడియారం స్తంభం వద్దకు పాదయాత్ర నిర్వహించారు. గడియారం స్తంభం వద్ద మూడు రోడ్ల కూడలిలో దాదాపు అరగంట పాటు రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనతో పెద్దాపురం – పిఠాపురం, కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలియడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులు వచ్చేంత వరకూ ఆందోళన విరమించేంది లేదని రైతులు స్పష్టం చేశారు. ఏఓ రావాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన సామర్లకోట వ్యవసాయాధికారి (ఏఓ) వి.మురళీధర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఎన్నో ఇబ్బందులు
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, సాగుదార్లలో 50 శాతం మంది నిరక్షరాస్యులేనని అన్నారు. వీరికి టచ్ ఫోన్లు ఉపయోగించడంపై అవగాహన లేదని చెప్పారు. అలాగే, కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారని, అసలైన రైతులు ఇతర ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నారని తెలిపారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేస్తే ఓటీపీ ఎక్కడో ఉన్న రైతులకు వెళ్తుందని, వారు ఏవిధంగా ఓటీపీ చెబుతారని ఏఓను నిలదీశారు. ఈ పరిస్థితుల్లో యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు తమకు సమస్యగా మారుతుందని చెప్పారు. యాప్ వద్దని, పాత పద్ధతే ముద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో మాదిరిగానే ఎకరానికి ఐదు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరితో పాటు గడ్డి పండించుకోవడానికి ఎకరాకు మూడు బస్తాలిస్తే ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో రైతులు వల్లూరి వెంకట రమణ, బోళ్ల అప్పారావు, కోడూరి సూరిబాబు, నేతల హరిబాబు, మూతిన రాజు, చలికి వెంకట్రావు, బలుసు వీరభద్రరావు, మున్నియ్య, వట్టికూటి గోపి, సత్తి కొండలరావు, సిరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మావల్ల కాదు
ఎరువులకు యాప్ వద్దు
పాత పద్ధతిలోనే ఇవ్వాలి
లేకపోతే క్రాప్ హాలిడే
రైతుల హెచ్చరిక
సామర్లకోటలో నిరసనాగ్రహం


