
ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్
మెయిన్ రోడ్డు నుంచి టోల్‌గేట్‌కు..
గతంలో భక్తులు వాహనాల్లో రత్నగిరికి వెళ్లాలంటే అన్నవరం మెయిన్ రోడ్డు నుంచి నేరుగా టోల్‌గేట్ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసీ బస్సులను మెయిన్ రోడ్డు మీద టోల్‌గేట్ ఎదురుగా ఆపి భక్తులను దింపేవారు. దీనివలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగేది. అడపాదడపా ప్రమాదాలు కూడా జరిగేవి. అయితే 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ హయాంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న కళాశాల మైదానం గేటు నుంచి సర్వీస్ రోడ్డు మాదిరిగా మరో రోడ్డును టోల్‌గేట్ వరకూ నిర్మించారు. రత్నగిరికి వెళ్లే వాహనాలు అక్కడే ఆ రోడ్డులోకి మారి నేరుగా టోల్‌గేట్ వద్దకు చేరుతూండటంతో మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ప్రమాదాలు కూడా జరగడం లేదు. టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తుల కోసం 2023లో కొండ దిగువన కళాశాల మైదానంలో ఆరు విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ఇవన్నీ భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
అన్నవరం: కూటమి ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానంలో కట్టిన గోడ వారం రోజుల వ్యవధిలోనే.. ఒక్క వానకే క్పుకూలిపోయింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం నాడు జరిగిన ఈ దుర్ఘటన ఏడుగురు భక్తులను బలిగొంది. ఆ గోడ నిర్మాణంలో ఉపయోగించిన నాశిరకం మెటీరియల్ వాడారని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. దీనికి భిన్నంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో చేపట్టిన పలు నిర్మాణాలు మహా స్ట్రాంగ్‌గా నిలచి, భక్తులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సింహాచలం దేవస్థానం దుర్ఘటన నేపథ్యంలో.. అన్నవరం దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.30 కోట్లతో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వివిధ నిర్మాణాలు చేపట్టారంటూ సానుకూల చర్చ నడుస్తోంది.
శివసదన్ సత్రం
సత్యగిరిపై సుమారు రూ.20 కోట్లతో 135 గదులతో నిర్మించిన శివసదన్ సత్రం 2023 నవంబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ నిర్మాణం 2018లోనే మొదలైనా.. కరోనా వైరస్ కారణంగా రెండేళ్లు, దానివల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో ఏడాది పనులు నెమ్మదిగా సాగాయి. చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దీని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ సత్రం భక్తులకు అందుబాటులోకి రావడంతో వసతి సమస్య చాలా వరకూ పరిష్కారమైంది. దీని ద్వారా దేవస్థానానికి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది.
సత్యదేవుని నమూనా ఆలయం
జాతీయ రహదారిపై రూ.4 కోట్లతో సత్యదేవుని నమూనా ఆలయం నిర్మాణ పనులు 2023లో ప్రారంభించారు. గత ఏడాది మే నాటికి నమూనా ఆలయం, ప్రసాదం కౌంటర్, ప్రహరీ నిర్మాణాలు పూర్తి చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల మూర్తులను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి, స్వామివారిని దర్శించుకుని, ప్రసాదాలు కొనుగోలు చేయడానికి వీలుగా ఈ నమూనా ఆలయం నిర్మించారు.
చెక్కు చెదరని నమూనా ఆలయం గోడ
నమూనా ఆలయం చుట్టూ కాంక్రీట్‌తో బలమైన ప్రహరీ నిర్మించారు. వర్షాకాలంలో పంపా బ్యారేజీ గేట్లు ఎత్తినపుడు వరద నీరంతా జాతీయ రహదారి మీదుగా.. ప్రధానంగా ఉత్తరం, తూర్పు వైపు నిర్మించిన నమూనా ఆలయం ప్రహరీని ఆనుకుని ప్రవహిస్తుంది. గత ఏడాది సుమారు 5 వేల క్యూసెక్కుల వరద నీరు దీనిని ఆనుకుని ప్రవహించినప్పటికీ గోడలు బీటలివ్వడం కానీ, కృంగడం కానీ జరగలేదంటే.. దీనిని ఎంత పటిష్టంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు.
ఆదిశంకర మార్గ్
పాత సీఆర్‌ఓ కార్యాలయం వెనుక నుంచి రెండో ఘాట్ రోడ్డుకు కలిపే ఆదిశంకర మార్గ్ నిర్మాణం భక్తులకు ఎంతో ఉపయోగపడింది. 2023, 2024 కార్తిక మాసాల్లో ఈ రోడ్డు మీదుగా వందలాది వాహనాలు కొండ దిగువకు వెళ్లడంతో రత్నగిరిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. అలాగే, ప్రకాష్ సదన్ పక్క నుంచి నిర్మించిన ర్యాంపు రోడ్డు ద్వారా వాహనాలు నేరుగా పశ్చిమ రాజగోపురం వైపు వెళ్లే అవకాశం కలిగింది. అదే విధంగా సత్యగిరి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ ద్వారా వందలాది వాహనాలను నిలుపు చేయడానికి అవకాశం ఏర్పడి, భక్తులకు ఇబ్బంది తొలగింది.
ఎటువంటి విమర్శలకు తావు లేకుండా..
ఈ నిర్మాణాలన్నీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినప్పటికీ ఎక్కడా చెక్కు చెదరకపోవడం విశేషం. నాణ్యతపై ఎటువంటి విమర్శలూ రాలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నాటి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నిర్మాణాలను రెండుసార్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
సత్యదేవుని సన్నిధిలో
చెక్కుచెదరని రీతిలో నిర్మాణాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో
రూ.30 కోట్లతో పనులు
పూర్తి నాణ్యతతో నిర్మాణం
అధికారులు దృష్టి పెట్టాలి
సింహాచలం దేవస్థానంలో ఐదుగురు మంత్రులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు జరిగినా గోడ కూలిపోవడం అక్కడి నిర్మాణాల్లో నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలన్నీ ఇంతేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ కింద రూ.23 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలు, రూ.12 కోట్లతో చేపట్టే సీతారామ సత్రం నిర్మాణ నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలి. లేకుంటే సింహాచలం పరిణామాలే ఇక్కడ కూడా పునరావృతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్

ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్

ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్