
అప్పులతో ఏపీ మరో పాకిస్తానే
ఫ మెడలు వంచైనా హామీలు అమలు చేయిస్తాం
ఫ ధాన్యం కొనుగోలులో
సర్కార్ ఘోర వైఫల్యం
ఫ పౌర సరఫరాల మంత్రి
చెప్పేదంతా బూటకమే
ఫ సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి జగన్
ఫ కాకినాడ సమీక్షలో రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందని, ఈ లెక్కలు చూస్తూంటే ఏపీకి ఆర్థికంగా పాకిస్తాన్‌కు పట్టిన గతే పడుతుందని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చెత్తతో కూడా సంపద సృష్టిస్తామని చెప్పి, ఆ చెత్తను తరలించే ట్రాక్టర్లను తీసేశారని, రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడం చంద్రబాబు ఘనతని ఆక్షేపించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ పరిశీలకులు, ముఖ్య నేతలతో కాకినాడలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చెప్పుకోదగ్గ ఉత్పత్తి ఆధారంగా ఒక్క పని అయినా చేయగలిగారా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో మిగిల్చిన అప్పులతో కలిపి గడచిన ఐదేళ్లలో అప్పులు రూ.4.30 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏటా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏడాదిలోనే రూ.1.59 లక్షల కోట్ల అప్పులు చేసిన నిర్వాకం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇంతా చేసి పేదల సంక్షేమానికి ఏమీ ఖర్చు చేయలేదని చేసిన కోట్ల రూపాయల అప్పు ఎవరి ఖాతాల్లోకి పోయాయో, ఎవరు దోపిడీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా పేదలు, మధ్యతరగతి సంక్షేమం కోసం డీబీటీ ద్వారా నేరుగా వ్యక్తిగత ఖాతాలకు రూ.2.50 లక్షల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అప్పు చేసిన సొమ్ము పౌడర్లు, మేకప్‌లకు ఖర్చు చేశారని బొత్స ఎద్దేవా చేశారు. బాబు చెబుతున్నది చూస్తూంటే ఆయన చేతిలో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు.
మద్యం విధానంపై వేధిస్తున్నారు
మద్యం కుంభకోణం పేరుతో కొందరిని టార్గెట్ చేసి వేధిస్తూ, అప్రతిష్టపాల్జేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదన్నారు. మద్యం వ్యవహారంలో నిష్పక్షపాత విచారణను స్వాగతిస్తామని, కావాలని అన్యాయంగా కేసులు పెడుతూ పోతారా అని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని తీర ప్రాంతంలో హార్బర్లు, వైద్య కళాశాలలు, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం వంటి ఉత్పత్తి, ఉపాధి ఆధారంగా పెట్టుబడులు పెట్టామని వివరించారు.
సమస్యలపై ఆందోళనలు
సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ఆందోళనలకు సిద్ధమవుతోందని బొత్స చెప్పారు. ప్రధానమైన పొగాకు, ధాన్యం, ఆక్వా రైతుల సమస్యలపై వారికి అండగా నిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో క్షేత్ర స్థాయికి వస్తారని తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జూన్‌లో మండల, జూలై నెలాఖరుకు గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కాకినాడ సమీక్షలో తీర్మానించినట్లు చెప్పారు. జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని బొత్స వెల్లడించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వంకా రవీంద్ర, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, అనంత ఉదయ్ భాస్కర్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (తూర్పు గోదావరి), దాడిశెట్టి రాజా (కాకినాడ), చిర్ల జగ్గిరెడ్డి (కోనసీమ), పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, తోట నరసింహం, కారుమూరి నాగేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్, కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దూలం నాగేశ్వరరావు, పొన్నాడ సతీష్‌కుమార్, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు.
రైతుల ఇబ్బందులు పవన్‌కు పట్టవా?
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఘోర వైఫల్యం ప్రధానంగా గోదావరి జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోందని బొత్స దుయ్యబట్టారు. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పేదంతా బూటకమన్నారు. గోదావరి ప్రాంతం నుంచి గెలుపొందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతుల వద్దకు రాకపోవడం వారి దురదృష్టమని అన్నారు. ధాన్యం కొనే నాథుడు లేక గోదావరి జిల్లాల రైతులు నానా యాతనా పడుతూంటే పవన్ కల్యాణ్ ఒక్కసారైనా ఈ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారా అని ప్రశ్నించారు. కోకో ధర కోసం అధికార పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే తదితరులు ఆందోళనకు దిగడం రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు, ఆక్వా రైతుల ఇబ్బందులపై పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా మరో రెండు హామీలివ్వాలని తామంతా ఒత్తిడి తెచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి చేయగలిగిందే చెబుదామన్నారని, చంద్రబాబు మాదిరిగా అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించ లేదని బొత్స చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా అన్ని హామీలనూ ప్రభుత్వ మెడలు వంచైనా సరే అమలు చేసేలా వైఎస్సార్ సీపీ ఒత్తిడి తెస్తుందని అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీకి ప్రజలిచ్చిన 40 శాతం ఓటింగ్ చిన్న విషయం కాదన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు ప్రజలే వైఎస్సార్ సీపీకి రెండంకెల ఓటింగ్ ఇచ్చారన్నారు.