
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం
అన్నవరం: ఆర్టీసీ బస్టాండ్‌లలో ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి వారి బ్యాగుల్లో గల విలువైన ఆభరణాలు, నగదు అపహరిస్తున్న ఇద్దరు మహిళా దొంగలను శుక్రవారం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద అరెస్ట్ చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం, ప్రత్తిపాడు బస్‌స్టేషన్ల వద్ద తమ బంగారు వస్తువులు దొంగలు అపహరించారని మహిళలు ఆయా పోలీస్‌స్టేషన్‌లలో కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్‌ల వద్ద నిఘా పెట్టారు. శుక్రవారం అన్నవరం బస్ కాంప్లెక్స్ వద్ద దొంగతనం చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకటలక్ష్మి, రామవరప్పాడుకు చెందిన నక్కా మంగగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్‌ఐ శ్రీహరి బాబు, అడిషనల్ ఎస్‌ఐ ప్రసాద్ పాల్గొన్నారు.