
గడువులోగా హైవేల నిర్మాణం
కాకినాడ సిటీ: జిల్లాలో చేపట్టిన వివిధ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), రెవెన్యూ, సర్వే, ఏపీఈపీడీసీఎల్, పోలవం ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జాతీయ రహదారి 216 కాకినాడ–కత్తిపూడి, కాకినాడ పోర్టు–అచ్చంపేట, అచ్చంపేట–సామర్లకోట, వాకలపూడి–అన్నవరం వరకు నిర్మించనున్న జాతీయ రహదారులు, నిర్మాణ దిశలో ఉన్న రహదారుల పనులు పురోగతి, ఇతర భూసేకరణ, టెండర్లు ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో చర్చించారు. ఎన్‌హెచ్‌ఎఐ పీడీ డి.సురేంద్ర, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ జి ప్రసాద్, తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని బీట్ ది హీట్ థీమ్‌తో నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు, హ్యుమిడ్ వాతావరణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సూచించిన వివిధ అంశాలతో ఈ నెల స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.