
టెన్త్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డీఆర్వో జె.వెంకటరావు, రెవెన్యూ, పాఠశాల విద్య, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, ట్రెజరీ, రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో 5,956 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ప్రశ్నాపత్రాలు స్టోరేజీ నిమిత్తం 18 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదోతరగతి (ఓపెన్ ఎస్‌ఎస్‌సీ), ఓపెన్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని డీఆర్వో తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలతో పాటు ఓపెన్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడిట్ సప్లమెంటరీ పరీక్షలు ఉదయం పూట నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 1,151 మంది విద్యార్థులకు నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి పి రమేష్, డీటీసీ లక్ష్మికిరణ్, పోస్టల్ పీఆర్‌ఐపీ కె.ప్రసాదరావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.వెంకటరావు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి పి సాయివెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.