
ఉపాధి శ్రామికులపై తేనెటీగల దాడి
కపిలేశ్వరపురం: మాచర గ్రామ శివారు శ్రీరామపురం ఏటిగట్టుపై జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా తుప్పలను తొలగిస్తున్న గ్రామీణ వికాస్ శ్రామికులపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. కోరుమిల్లి గ్రామ శివారు చిన్నకోరుమిల్లికి చెందిన కొండమూరి ఏసును తీవ్రంగా కుట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే సహచర శ్రామికులు మోటారు సైకిల్‌పై కపిలేశ్వరపురం సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి పి.రాజ్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందించారు. ఏసు కోలుకొంటున్నాడని, మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్టు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఇన్‌చార్జి ఏపీఓ రజిత్‌సింగ్ తెలిపారు. అలాగే తేనెటీగల దాడిలో గంగుమళ్ల కృష్ణ, కోలపల్లి త్రిమూర్తులు స్వల్పంగా గాయపడ్డారు.
వాడపల్లి ఆలయంలో
బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు జరిపారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం, క్యూలైన్లు, ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాడ వీధులు, అన్నప్రసాద ప్రాంగణాలు, తలనీలాలు సమర్పించే ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వాడపల్లి ఆలయంతో పాటు రావులపాలెం బస్ కాంప్లెక్స్‌లో తనిఖీలు జరిపినట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు.

ఉపాధి శ్రామికులపై తేనెటీగల దాడి