
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్‌కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌పై హరీష్ కోపం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్‌తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్‌ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు.
తల్లి ఫిర్యాదుతో..
తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లి ఆ మృతదేహాన్ని గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని సీఐ సునీల్ తెలిపారు. ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.