
అన్నవరం.. భక్తజన సంద్రం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి గురువారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. నవ దంపతులు, వారి బంధువులతో కలిసి, రత్నగిరిపై స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించగా, వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుని కల్యాణోత్సవాలు ముగియడంతో మరలా సత్యదేవుడు, అమ్మవార్లకు స్వామివారి నిత్య కల్యాణం,ఆయుష్య హోమం, వనదుర్గ అమ్మవారికి హోమాలు, సహస్ర దీపాలంకారణ, పంచహారతుల సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. దాత మట్టే సత్యప్రసాద్ దంపతులు స్వామి, అమ్మవార్లకు చేయించిన వజ్ర కిరీటాలను సోమ, గురువారాలు మినహ మిగిలిన ఐదు రోజులు అలంకరిస్తున్నారు. గురువారం పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, లింగాకారంలోని శివుడు నిజరూప దర్శనం ఇచ్చారు.
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం