
రాజుల తూరంగిలో భారీ చోరీ
కాకినాడ రూరల్: రాజుల తూరంగి గ్రామంలోని పురోహితుడు చంద్రమౌళి శ్రీనివాసశర్మ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగలు దోచుకున్నారు. ఇంద్రపాలెం పోలీసులు వివరాలు ప్రకారం.. శ్రీనివాసశర్మ గృహ ప్రవేశం పూజ కోసం రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆయన భార్య పుట్టింటికి వెళ్లడంలో ఇంట్లో ఎవరూ లేదు. ఇది గమనించిన దొంగలు లోపలకు ప్రవేశించి బంగారం, నగదు చోరీ చేశారు. పూజా కార్యక్రమం అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు వచ్చిన శ్రీనివాస శర్మ.. ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. లోపలకు వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. వెంటనే ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్సీ మనీష్ దేవరాజు పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దింపి వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఇంద్రపాలెం అదనపు ఎస్సై సూర్య కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.