
పాడైన గుడ్లే పోషకాహారం!
● గొర్రిపూడి అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ
● ఆందోళన వ్యక్తం చేసిన లబ్ధిదారులు
కరప: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లేక అక్కడి చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులకు, గర్భిణులకు పోషకాహారం నిమిత్తం అందించే కోడిగుడ్లపై అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలం గొర్రిపూడి మార్కెట్‌సెంటర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఈ నెల 7వ తేదీన సరఫరా చేసిన కోడిగుడ్లను ఆదివారం లబ్ధిదారులు ఇంటి వద్ద ఉడకబెట్టగా దుర్వాసనతో కుళ్లిపోయాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షానికీ, ఎండకూ పాడయ్యాయి
ఈ విషయమై సెక్టార్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి వివరణ ఇస్తూ కోడిగుడ్లు చెడిపోవడం వాస్తవమేనని, అయితే వాటిని ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. నాలుగు రోజుల క్రితం కోడిగుడ్లు తీసుకు వచ్చే వ్యాన్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా ప్లేట్‌లెట్లు పడిపోవడంతో కాకినాడ ఆసుపత్రిలో చేరారని, కోడిగుడ్లతో ఉన్న వ్యాన్‌ను బయట ఉంచేయడంతో వర్షానికి తడిసి, ఎండకు పాడైపోయాయని తెలిపారు. డ్రైవర్ కోలుకున్నాక ఈ విషయం ఏజన్సీ యజమానికి చెప్పకుండా అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చి వెళ్లిపోయాడు. ఆదివారం కోడిగుడ్లు పాడైనట్టు గుర్తించిన వెంటనే ఏజన్సీస్‌కి తెలియజేస్తే, పాడైన గుడ్లను వెనక్కి తీసుకుని, మంచివి ఇచ్చేందుకు అంగీకరించారని, ఇదే విషయాన్ని సీడీపీఓకు కూడా తెలియజేసినట్టు విజయలక్ష్మి తెలిపారు.