రథోత్సవంపై సూర్య ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

రథోత్సవంపై సూర్య ప్రతాపం

May 12 2025 12:19 AM | Updated on May 12 2025 12:19 AM

రథోత్

రథోత్సవంపై సూర్య ప్రతాపం

జనం రాక కళ తప్పిన ఉత్సవం

నూతన రథంపై సత్యదేవుడు,

అమ్మవారి ఊరేగింపు

అన్నవరం: సత్యదేవుని రథోత్సవంపై సూర్యుడు ప్రతాపం చూపించాడు. నిప్పుల వర్షం కురిసినట్టుగా ఎండ కాయడంతో ఆశించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఉత్సవం కళ తప్పింది. వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం సాయంత్రం సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. ఎండ తీవ్రతకు తోడు సరైన ప్రణాళిక లేకపోవడంతో రథోత్సవం ప్రారంభ సమయానికి గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. గత ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగగా, ఈసారి 4 గంటలకు మొదలై రాత్రి 7.30 గంటలకే ముగిసింది. గత ఏడాది రథోత్సవం సాయంత్రం 5 గంటలకు మొదలైంది. అప్పటికి ఎండ తగ్గడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసారి ఉత్సవం మొదలయ్యే సమయానికి 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రత ఉండటంతో గ్రామస్తులు, భక్తులు పెద్దగా రాలేదు. వారితో పోలిస్తే దేవస్థానం సిబ్బంది, పోలీసులు, కళాకారులే అధికంగా కనిపించారు. ప్రారంభ సమయానికి 250 మంది దేవస్థానం సిబ్బంది, 150 మంది పోలీసులు, 200 మంది కళాకారులు మాత్రమే ఉన్నారు. సాయంత్రం 5.30 గంటల సమయానికి కాస్త ఎండ తగ్గడంతో గ్రామస్తులు వచ్చారు. ఉత్సవం ముగిసే సమయానికి సుమారు 3 వేల మంది మాత్రమే ఉన్నారు. రథోత్సవంలో కోలాటం, కేరళ డప్పులు, విచిత్ర వేషాలు తదితర కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాత్రి అయితే ఎక్కువ మంది భక్తులు వీటిని తిలకించే అవకాశముండేది.

ఉత్సవం జరిగిందిలా..

సత్యరథాన్ని ఉదయం 8 గంటలకు పంపా సత్రం నుంచి రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. రంగురంగుల పువ్వులు, విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, రథంపై వేంచేయించి, పూజలు నిర్వహించారు. రథం ముందు కుంభం పోసి, గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం సిబ్బంది, ధవళేశ్వరం, అంతర్వేది తదితర గ్రామాల నుంచి వచ్చిన నిపుణులు రథాన్ని లాగారు. ముందు ట్రాక్టర్‌, వెనుక జేసీబీకి పగ్గాలు కట్టి, వాటితో రథాన్ని నియంత్రించారు. రథం తయారు చేసిన కొల్లాటి శ్రీనివాస్‌ బృందం ఆద్యంతం రథం వద్దనే ఉంది. ప్రధానంగా రథం మలుపు తిప్పే సమయంలో చాకచక్యంగా పని చేశారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్‌ వరకూ, అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా మీదుగా దేవస్థానం టోల్‌గేట్‌ వరకూ, అక్కడి నుంచి కొత్తగా నిర్మించిన రథం షెడ్డు మీదుగా తొలి పావంచా వరకూ రథోత్సవం సాగింది. అనంతరం, స్వామి, అమ్మవార్లను రథం నుంచి కిందకు దించి, ఊరేగింపుగా కొండపై ఆలయానికి చేర్చారు. రథాన్ని షెడ్డులోకి తరలించారు. దేవస్థానం డిప్యూటీ ఈఓ చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ విశ్వనాథరాజు, ఇంజినీరింగ్‌ ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, డీఈలు ఉదయ్‌, బీఎస్‌ రాంబాబు, ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, సుమారు 150 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. రథం వద్దకు రాకుండా భక్తులను నియంత్రించేందుకు రెండు రోప్‌ పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఊహించినంతగా భక్తులు రాకపోవడంతో పోలీసులకు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. రథం లాగే అవకాశం కల్పించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యుత్‌ సరఫరా నిలిపివేత

రథోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్‌ రోడ్డులో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలోని వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే రథోత్సవం త్వరగా పూర్తి కావడంతో రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. గత ఏడాది రాత్రి 12 గంటలకు కానీ విద్యుత్‌ సరఫరా ఇవ్వలేకపోయారు. రథోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకూ అన్నవరం మెయిన్‌ రోడ్డులో వాహనాలు నిలిపివేశారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారి మీదుగా మళ్లించారు.

అన్నవరంలో నేడు

తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ

ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ

ఉదయం 9.00 : కొండ దిగువన పంపా నది వద్ద సత్యదేవుడు, అమ్మవారికి చక్రస్నానం

సాయంత్రం 4.00 : అనివేటి మండపం వద్ద నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచనం

ఉదయం 7.00 – 10.00 వరకూ, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 వరకూ : రత్నగిరి కళావేదిక మీద, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు

ఘనంగా వన విహారోత్సవం

కల్యాణోత్సవాల్లో భాగంగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లకు వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను రత్నగిరి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఊరేగింపుగా కొండ దిగువన ఉద్యానవనంలోని మండపం వద్దకు తీసుకువచ్చి, అక్కడి వేదికపై వేంచేయించారు. సాయంత్రం 4 గంటలకు పండితులు పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను దేవస్థానం చైర్మన్‌, ఈఓల తరఫున పండితులు సమర్పించి, వేదాశీస్సులు అందజేశారు. కార్యక్రమాన్ని వేద పండితులు యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్‌, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి, అర్చకుడు గంగాధరభట్ల శ్రీనివాస్‌, పవన్‌ తదితరులు నిర్వహించారు.

రథోత్సవంపై సూర్య ప్రతాపం1
1/4

రథోత్సవంపై సూర్య ప్రతాపం

రథోత్సవంపై సూర్య ప్రతాపం2
2/4

రథోత్సవంపై సూర్య ప్రతాపం

రథోత్సవంపై సూర్య ప్రతాపం3
3/4

రథోత్సవంపై సూర్య ప్రతాపం

రథోత్సవంపై సూర్య ప్రతాపం4
4/4

రథోత్సవంపై సూర్య ప్రతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement