
మాజీ మంత్రి రజనీపై పోలీసుల తీరు అమానుషం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
తుని రూరల్: ఆపరేషన్ సిందూర్‌లో విశేష సేవలు అందిస్తున్న మహిళా సైనిక అధికారులను చూసి దేశం గర్విస్తోందని, కానీ, రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. దేశ మహిళల శక్తిసామర్థ్యాలకు సంబంధించి ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాధిపతులతో సహా దేశప్రజలు ముక్తకంఠంతో అభినందిస్తున్నారని అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసుల తీరు దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. మాజీ మంత్రి, మహిళ అయిన విడుదల రజనీని సీఐ కారులోంచి లాగేసి, తోసేసి, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించారు. సతీష్ అనే నాయకుడిని తీసుకువెళ్లేందుకు మాజీ మహిళా మంత్రిపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా.. టీడీపీ నాయకుల ప్రాపకం కోసం నాటకాలాడుతున్నారా అని ప్రశ్నించారు. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానన్నారు. సంక్షోభంలో సంక్షేమం, రాజకీయం, డబ్బులు, అవినీతిని వెతుక్కోవడంలో చంద్రబాబు అంత పనోడు దేశంలో మరెవ్వరూ ఉండరని విమర్శించారు. ఒకపక్క దేశం యుద్ధంలో ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు, రైతులకు, మహిళలకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందించడం లేదన్నారు. ప్రతిపక్షాలను వేధిస్తున్నారని, పోలీసులను ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని అన్నారు. తునిలో సైతం మున్సిపల్ చైర్‌పర్సన్ సుధారాణి భర్తను అదుపులోకి తీసుకుని, ఇంటిపై టీడీపీ నాయకులు దాడి చేసి, ఆమె పైనే కేసులు పెట్టి వేధించారని చెప్పారు. ఈ వేధింపులు భరించలేక చైర్‌పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న ఎనిమిది మంది నాయకులపై కేసులు పెట్టారని, కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారం ఉందని ఇదే తీరు అనుసరిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. మొన్నటి వరకూ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిందని, ఏమీ లేనప్పటికీ మద్యం కేసుల ముసుగులో అధికారులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలు శాశ్వతమని, అధికారులు, అధికారాలు తాత్కాలికమని, బాధ్యతతో వ్యవస్థలకు వన్నె తెచ్చే విధంగా మెలగాలని హితవు పలికారు. పరిధి దాటి ప్రవర్తించడం భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదని రాజా స్పష్టం చేశారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పక మానరని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రేలంగి రమణగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్, నియోజకవర్గ అధ్యక్షురాలు అంగుళూరి సుశీలరాణి, కౌన్సిలర్ సునితాలక్ష్మి పాల్గొన్నారు.