
భవిష్యత్‌లో చైనా టెక్నాలజీతో విగ్రహాలు
● సెమినార్‌లో పాల్గొన్న శిల్పి రాజ్‌కుమార్
● తయారీలో కొత్త పోకడలపై అధ్యయనం
కొత్తపేట: చైనా టెక్నాలజీని భవిష్యత్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ తరహా విగ్రహాలు రూపకల్పనపై దృష్టి సారించనున్నట్టు అంతర్జాతీయ శిల్పి డాక్టర్ డీ రాజ్‌కుమార్‌వుడయార్ తెలిపారు. చైనాలో నూతన టెక్నాలజీతో విగ్రహాల తయారీపై జరిగిన సెమినార్‌లో రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు. శుక్రవారం ఆ సెమినార్ విశేషాలను వివరించారు. వారం రోజుల పాటు సాగిన సెమినార్‌లో 250 దేశాల నుంచి వివిధ రకాల విగ్రహాల శిల్పులు పాల్గొన్నారన్నారు. ఇక్కడ సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కాంస్యంతో విగ్రహాలు తయారు చేస్తున్నామని, అక్కడ వీటితో పాటు ఇంకా అనేక రకాల లోహాలతో విగ్రహాలు తయారు చేస్తున్నారని తెలిపారు. భారీ కాంస్య విగ్రహాలను నిర్మించడంలో చైనా కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. సంప్రదాయ క్యాస్టింగ్ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని కలిపి భారీ స్థాయి విగ్రహాలను చైనా కంపెనీలు తయారు చేస్తున్నాయని, అత్యంత ఎల్తైన విగ్రహాలు కూడా ఆ దేశం టెక్నాలజీ ద్వారానే తయారవుతున్నాయన్నారు.
ముందు చిన్న నమూనా విగ్రహం తయారుచేసి, దానిని 3 డీ స్కానింగ్ చేసి, కంప్యూటర్ డిజైనింగ్ ద్వారా కోరుకున్న సైజుకు ఇమేజ్‌ను పెంచుతారని తెలిపారు. ఎత్తైన విగ్రహాల విడి భాగాలను సులభంగా పోత పోసేందుకు ఫౌండ్రీలు ఉన్నాయని తెలిపారు. పెద్ద పెద్ద ఫౌండ్రీల వల్ల తక్కువ సమయంలో విడి భాగాలను తయారుచేసే వీలు ఉంటుందన్నారు. భారీ విగ్రహాలు నెలకొల్పే విషయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలు చైనా కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు. విగ్రహాలే కాక పార్కులు, సాంస్కృతిక చిహ్నాలు, వివిధ కళాకృతులు నిర్మిస్తారని తెలిపారు.