ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి 16 మంది ఎంపిక
రాయవరం: ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించబోయే వారికి శిక్షణనిచ్చే డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(డైట్) సంస్థకు నూతనంగా అధ్యాపకులు నియామకం చేపట్టారు. డైట్‌లో రెగ్యులర్ అధ్యాపకులను నియమించకుండా వారి స్థానంలో ప్రభుత్వ/జెడ్పీ/మున్సిపల్ తదితర యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్స్ నుంచి అర్హత ఉన్న ఉపాధ్యాయులను డెప్యుటేషన్‌పై నియమిస్తున్నారు.
మూడేళ్ల కాలపరిమితికి నియమించిన అధ్యాపకులను ఇటీవల విధుల నుంచి విడుదల చేసి పంపించడంతో వారి స్థానంలో అవసరమైన సబ్జెక్టులకు కొత్త అధ్యాపకుల నియామక ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా గత నెల ఒకటో తేదీన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం గత నెల 10వ తేది వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కాకినాడలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి, వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహించి, మెరిట్ కమ్ సెలక్షన్ జాబితాను సిద్ధం చేశారు. దాని ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 మంది అధ్యాపకులను వివిద సబ్జెక్టులకు ఎంపిక చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం ఎంపికై న అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాల్లో విధుల నుంచి విడుదలై డైట్‌లో విధుల్లో చేరాల్సి ఉంది. డైట్‌కు ఎంపికై న అధ్యాపకుల స్థానాలను బదిలీలు/పదోన్నతులతో భర్తీ చేసే అవకాశముంది.