
ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్
రాయవరం: చెడు వ్యసనాలకు బానిసై..ఈజీ మనీ కోసం ఒక వ్యక్తి రహదారి పక్కన పుల్లల లోడుతో ఆపి ఉన్న ట్రాక్టర్ విత్ ట్రైలర్‌ను అపహరించుకు పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రాయవరం పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. మండలంలోని పసలపూడిలోని గోదావరి రైసు మిల్లు సమీపంలో అదే గ్రామానికి చెందిన పిల్లి జానకిరామయ్య గత నెల 10న పుల్లల లోడుతో ఉన్న ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్‌ను నిలిపి ఉంచాడు. ఉదయం చూసుకునే సరికి ట్రైలర్‌తో కూడిన ట్రాక్టర్ అక్కడ లేకపోవడంతో దొంగతనానికి గురైనట్లుగా భావించిన జానకిరామయ్య రాయవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై సురేష్‌బాబు దర్యాప్తు చేపట్టారు. వెదురుపాక గీతామందిరం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, కొంకుదురు వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్‌బాబు, హెచ్‌సీ సత్యకుమార్, పీసీలు వీరేంద్రను ఎస్పీ కృష్ణారావు అభినందించారు.