
కుట్టు శిక్షణ కుంభకోణంపై చర్యలు తీసుకోండి
కాకినాడ సిటీ: బీసీ, ఈబీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ, శిక్షణ పేరుతో రూ.245 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం తెర తీసిందని, బాధ్యులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు ఆధ్వర్యంలో నాయకులు గురువారం జేసీ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌లో రాబాబు విలేకర్లతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సీఎం చంద్రబాబునాయుడు బీసీ మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచిత కుట్టు మెషీన్లు, శిక్షణ పేరుతో బలోపేతం చేస్తామని ప్రకటించారని, ఆ హామీని అడ్డుపెట్టుకుని వారికి కేటాయించిన నిధులతో ఖజానాకు కన్నం పెట్టేందుకు కూటమి నేతలు సిద్ధమయ్యారని అన్నారు. నిధుల దోపిడీయే కాకుండా ఈ పథకం అంచనాలను అమాంతం పెంచేసి తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని, ఎక్కువ కోట్ చేసి సిండికేట్‌గా మారిన రెండు కంపెనీలకు ఇస్తూ టెండర్ల ప్రక్రియ దశలోనే అక్రమాలకు తెరతీయడం దారుణమని రాజబాబు అన్నారు. ఈ పథకం ద్వారా 1.02 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.23 వేల చొప్పున కేటాయిస్తున్నారని ప్రకటించారన్నారు. కుట్టు మెషీన్ కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.4,300, శిక్షణ నిమిత్తం రూ.3 వేల చొప్పున కేటాయిస్తే లక్ష మందికి రూ.73 కోట్లు ఖర్చవుతుందన్నారు. మిగిలిన రూ.167 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు.