
ప్రధానిని కించపరచినందుకు అరెస్టు
మామిడికుదురు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కించపరుస్తూ అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన గోగన్నమఠం గ్రామం ముత్యాలపాలేనికి చెందిన కర్రి మోహనకనకదుర్గారావును అరెస్టు చేసినట్టు సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం తెలిపారు. నగరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించామన్నారు. సోషల్ మీడియాలో పెట్టె ప్రతి పోస్టుపైన రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక వింగ్ పరిశీలిస్తుందన్నారు. అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అనుచిత వ్యాఖ్యలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.