కిల్కారీ.. రేపటి తల్లికి ఉపకారి

- - Sakshi

కాకినాడ సిటీ: మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా గర్భిణికి సరైన సమయానికి అవసరమైన జాగ్రత్తలు, మందులు తీసుకునేలా అలర్ట్‌ చేసే ఫోన్‌ కాల్స్‌ దేశంలోని ఐదు భాషల్లో వస్తున్నాయి. ఇవి ప్రస్తుతం తెలుగులో కూడా వస్తున్నాయి. మహిళ గర్భం దాల్చింది మొదలు బిడ్డకు జన్మనిచ్చేంత వరకూ వారి వివరాలను ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రత్యేక యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. తద్వారా గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది.

మరో మెట్టు ఎక్కి, ఇప్పుడు నేరుగా గర్భిణులతోనే మాట్లాడేలా ‘కిల్కారీ’ కాల్స్‌ పేరిట మరో సాంకేతిక విప్లవం తీసుకువచ్చారు. ‘కిల్కారి’ అంటే తెలుగులో ‘చిన్నారి చిరునవ్వు’ అని అర్థం. ఈ విధానం జిల్లాలో కూడా అమలులోకి వచ్చింది. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి పిల్లలు పుట్టిన ఏడాది వరకూ ఏ వారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కాల్స్‌ ద్వారా ఒక వైద్యుడు తెలియజేసినట్లు వివరిస్తారు. ఈ మేరకు ప్రతి గర్భిణి ఫోన్‌ నంబర్‌కు 01133278000 అనే నంబర్‌ నుంచి వారానికోసారి కాల్‌ వస్తుంది. ప్రతి కాల్‌ రెండు నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది. మొదటిసారి కాల్‌ లిఫ్ట్‌ చేయకపోతే మరో రెండుసార్లు కాల్స్‌ వస్తాయి.

ఎంతో ప్రయోజనం
గర్భిణికి సుఖ ప్రసవం కావడంతో పాటు పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ కాల్స్‌ తోడ్పడుతున్నాయి. చేతుల పరిశుభ్రత లేకపోతే జరిగే నష్టాలు, అలాగే పిల్లలు విరేచనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వయస్సుకు తగిన బరువు ఉండేందుకు ఏం చేయాలి, పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం వంటి సూచనలు, సలహాలు ఇందులో ఉంటాయి. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లోనే తీసుకొచ్చినా ఇటీవల విస్తృత ప్రాచుర్యం కల్పించారు. మొదట్లో హిందీ, బెంగాలీ, బిహారీ, ఒరియా, అస్సామీ భాషల్లో ఈ సేవలు అందించారు. ప్రస్తుతం తెలుగులో కూడా ప్రారంభించారు.

ఫోన్‌ కాల్స్‌ ఇలా ఉంటాయి
‘అన్నయ్యా, వదినమ్మా నమస్కారం. బాగున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిల్కారీ మొబైల్‌ సేవ నుంచి వైద్యుడిని మాట్లాడుతున్నా.. మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆరోగ్య సంరక్షణకు మీరు ఆచరించేందుకు సులువుగా ఉండే విషయాలు చెబుతా వినండి. మనమంతా కలిసి మీ బిడ్డకు మెరుగైన భవిష్యత్తు అందిద్దాం’ అంటూ గర్భిణులకు నాలుగో నెల నుంచి వారానికో ఆడియో మెసేజ్‌ వస్తుంది.

బిడ్డ పుట్టిన తర్వాత..

బిడ్డ పుట్టిన తర్వాత ‘నమస్కారం.. మీకు తెలుసా? పుట్టిన గంటలోపే బిడ్డకు పాలు తాగించాలి. తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం. బిడ్డకు కావాల్సినవన్నీ ఈ పాలలో ఉంటాయని చెబుతున్నారు’ అంటూ కిల్కారీలో నమోదైన ప్రతి గర్భిణి, బాలింత మొబైల్‌కు ఆడియో మెసేజ్‌లు వస్తాయి. ఆండ్రాయిడ్‌, కీప్యాడ్‌ ఫోన్ల ద్వారా ఈ సేవలు పొందవచ్చు. బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకూ 52 వారాల పాటు ఫోను ద్వారా సలహాలు ఇస్తారు.

నాలుగో నెల నుంచి సూచనలు
గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. మూడు నెలలు పూర్తయ్యాక సమయానికి నిద్ర అవసరమని, నిద్ర పోయేటప్పుడు ఎడమ వైపునకు ఉంటే బిడ్డకు, తల్లికి మంచిదని తెలిసింది. నాలుగో నెలలో పెరగాల్సిన బరువు, రక్త ప్రసరణ సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు చెప్పారు. చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మంచిదని సూచించారు.
– కొప్పాడ రామలక్ష్మి, ఏఎస్‌ఆర్‌ కాలనీ, తూరంగి

మారుమూల ప్రాంతాల్లో సైతం
కిల్కారీ పోర్టల్‌ వల్ల మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు సైతం అవగాహన పెరుగుతుంది. బిడ్డకు ఏడాది వయసు వచ్చే వరకూ సేవలు అందుతాయి. ఈ సూచనలు పాటించడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మాతా శిశు మరణాలను చాలా వరకూ తగ్గించవచ్చు.
– డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి

Read latest Kakinada News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top