
● వెంటనే విచారణ చేపట్టండి
● డీఎంహెచ్‌ఓలు, ఆరోగ్యశ్రీ డీసీలకు కలెక్టర్ల ఆదేశాలు
● 24న ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం
● ‘వైద్యో నారాయణో హరిహరీ’పై స్పందన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ‘వైద్యో నారాయణో హరిహరీ’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తూర్పు గోదావరి, కాకినాడ కలెక్టర్లు స్పందించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను దోచుకుంటున్న తీరుపై వెంటనే విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుడు చూడకుండానే అక్కడి సిబ్బంది వేల రూపాయల వైద్య పరీక్షలు రాయడం.. ఆరోగ్యశ్రీలో అవకతవకలకు పాల్పడుతున్న వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ ప్రియాంకలను కలెక్టర్ కె.మాధవీలత వివరణ కోరారు. సంబంధిత ఆసుపత్రుల వివరాలను తమకు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా అధికారులు కలెక్టర్‌కు రెండు రోజుల్లో నివేదిక అందించనున్నారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలతో ఈ నెల 24న కలెక్టరేట్‌లో కలెక్టర్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. అలాగే కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలాక్కియ కూడా ఈ కథనానికి స్పందించారు. సంబంధిత వైద్యాధికారులను ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ రాధాకృష్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ అమలు తీరును ఆమెకు రాధాకృష్ణ వివరించారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై విచారణ జరుపుతామని, వివరాలు అందజేస్తామని జేసీకి రాధాకృష్ణ తెలిపారు.
