● ప్రభుత్వం సూచించిన
వరి వంగడాలనే విక్రయించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాలన్యూటౌన్: రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో గురువారం ఆయన ఆకిస్మక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలకు చెందిన పలు రకాల విత్తన పాకెట్లు, రశీదు పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, జేజీఎల్ 1798, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ (సోనా) రకాలకు మాత్రమే ప్రభుత్వం ఈఏడాది బోనస్ చెల్లిస్తుందన్నారు. వ్యవసాయశాఖ సూచించిన వంగడాలను మాత్రమే రైతులు సాగుచేయాల్సి ఉందన్నారు. విత్తన డీలర్లు వాటిని మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అదే విధంగా నానో యూరియా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రతి పెస్టిసైడ్, సీడ్ దుకాణాల వద్ద స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటుచేసి, అందులో సమగ్రంగా వివరాలు పొందుపర్చాలని సూచించారు. కాగా, రైతులకు ఇచ్చే రశీదులను డీలర్లు ఇష్టానుసారం సొంతంగా ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సంబందిత డీలర్లకు నోటీసులు జారీ చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కాగా, స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో ఇష్టానుసారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్.. అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ప్రకటనల బోర్డులను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్‌కు సూచించారు. ఆయన వెంట డీఏఓ వీరప్ప, ఏఓ ప్రతాప్‌కుమార్, టెక్నికల్ ఏఓలు చంద్రశేఖర్, భవాని ఉన్నారు.
ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. గద్వాల మండలం గోనుపాడు వద్ద ఉన్న పాల్‌టెక్నిక్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన ల్యాబ్‌లను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వాలని.. సెమినార్లు నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని అధ్యాపకులకు సూచించారు. ఈఏడాది నూతనంగా సైబర్ ఫిజికల్ సిస్టం సెక్యూరిటీ కోర్సు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాలిసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఇప్పటికే వివిద కోర్సుల్లో చేరిన విద్యార్థులు కొత్త కోర్సులోకి మారేందుకు అవకాశం ఉంటుందన్నారు. వడ్డేపల్లి ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం సమీపంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. సిబ్బంది హాజరు, కొత్త విద్యార్థినుల అడ్మిషన్లపై ఆరా తీశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు రోజులైనా విద్యార్థినులు పూర్తిస్థాయిలో రాకపోవడమేమిటని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి జ్యోతి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్, ఎస్‌ఓ గోపిలత పాల్గొన్నారు.


