జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి

జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి

గద్వాల/ధరూరు: కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్‌ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్‌ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్‌ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం

జూరాల జలాశయంలో డీసిల్టింగ్‌కు చర్యలు

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దుష్ప్రచారాన్ని నమ్మొద్దు:

మంత్రి వాకిటి

ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం..

జూరాల ప్రాజెక్టు భద్రంగా ఉందని.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో అనవసరంగా ఆందోళన కలిగించే ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టుతో గద్వాల ప్రాంతం సస్యశ్యామలంగా ఉందన్నారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని వారు అర్థంలేని అసత్యపు ప్రచారం చేస్తున్నారని.. పచ్చకామెర్లు వచ్చినవాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వారి మాటలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాల జలాశయంలో సిల్ట్‌ పేరుకుపోయి నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఈఎన్‌సీ శ్రీనివాస్‌, సీఈ ప్రమీల, సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఎస్‌ఈ రహీముద్దీన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement