
రసాయనాలతో సాగు భూములు నిర్జీవం
● పెట్టుబడి లేని వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ● హాజరైన వివిధ ప్రాంతాల రైతులు
జగిత్యాలఅగ్రికల్చర్: హరిత విప్లవం ద్వారా పంట ఉత్పత్తి లక్ష్యాలు సాధించినప్పటికీ.. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, కలుపు మందులతో సాగు భూములు నిర్జీవం అవుతున్నాయని దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ శిక్షణ నిపుణులు బసంపల్లి నాగరాజు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సురభి గోశాలలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆదివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనాలతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోయి పంటల దిగుబడి తగ్గిపోతోందని తెలిపారు. పురుగుమందుల పిచికారీతో వాతావరణ కాలుష్యంతో మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర ఉత్పత్తులను సమాజానికి అందించేందుకే రైతులు గోఆధారిత, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. రసాయనాలతో రైతులు పండించిన పంట ఉత్పత్తులను తినేందుకు ప్రజలు జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. ఆవుమూత్రం, పేడతో ఘనామృతం, జీవామృతం, నీమాస్త్రం తయారు చేసి పంటలకు పోషకాలు అందిస్తూనే.. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టవచ్చని తెలిపారు. మురళీధర గోదాం వ్యవస్థాపకుడు చెన్నమనేని పద్మ మాట్లాడుతూ.. గోఆధారిత వ్యవసాయంతో భూమి ఆరోగ్యంగా ఉండడంతోపాటు మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుందని వెల్లడించారు. గోఆధారిత ఉత్పత్తులు వాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గోఆధారిత ఉత్పత్తుల తయారీతో స్వయం ఉపాధి పొందవచ్చని, ఇందుకోసం శిక్షణ కూడా ఇస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ఉందన్నారు. ఆవుమూత్రం, పేడతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు. గోశాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి కమలాకర్‌రావు, గ్రామ భారతి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.