
వాషింగ్టన్: అమెరికా విధిస్తున్న సుంకాలపై పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల వాదనను పదేపదే సమర్థించుకుంటున్నారు. తాజాగా ఆయన అమెరికా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా కోర్డు తీర్పు ఇస్తే మరోమారు 1929 నాటి ఆర్థికమాంద్యం ఏర్పడుతుందని హెచ్చరించారు.
ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుపై యూఎస్ ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు త్వరలో తీర్పును వెల్లడించనున్న సమయంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అలాగే స్టాక్ మార్కెట్‌పై సుంకాల ప్రభావం సానుకూలంగా ఉండబోతున్నదని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాశారు. సుంకాల కారణంగా దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఫలితంగా మన దేశం(అమెరికా) ఖజానాలోకి బిలియన్ డాలర్లు చేరుతున్నాయి. సుంకాల విధింపు దేశీయ తయారీని ప్రోత్సహిస్తుంది. ఆదాయపు పన్నుకు ప్రత్యామ్నాయంగా మారుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
సుంకాల కారణంగా అమెరికాకు ఇప్పటివరకు చూడని సంపద సమకూరనున్నదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇటువంటి సంపద సృష్టి ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఒక రాడికల్ వామపక్ష కోర్టు తీర్పు ఇస్తే, అంత పెద్ద మొత్తంలో ధనాన్ని, గౌరవాన్ని తిరిగి ఎప్పటికీ పొందలేమని ట్రంప్ పేర్కొన్నారు. మన దేశం విజయానికి, గొప్పతనానికి అర్హమైనదని, గందరగోళం, వైఫల్యం, అవమానానికి ఆస్కారం లేదని ట్రంప్ పేర్కొన్నారు. దేవుడు అమెరికాను ఆశీర్వదిస్తున్నాడు అని ట్రంప్ తన ‘ట్రూత్’లో రాశారు.
చైనా, కెనడా,మెక్సికో తదితర దేశాలు అమెరికా విధించిన సుంకాలపై కోర్టును ఆశ్రయించాయి. ఈ తరహా సుంకాల విధింపునకు అధ్యక్షుడు ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ)ను ఉపయోగించడంపై ఈ కేసు దృష్టి సారించనుంది. ఒక వేళ ఈ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పువస్తే, కొత్త సుంకాల అమలుకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా ఓడిపోయిన పార్టీ తరువాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 1929లో తలెత్తిన మహా మాంద్యం.. ఆధునిక చరిత్రలో తీవ్రమైన ఆర్థిక మాంద్యాలలో ఒకటి. ఇది యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభమై, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పారిశ్రామిక ఉత్పత్తి, ధరలు, వాణిజ్యం గణనీయంగా పడిపోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. బ్యాంకులు మూతపడ్డాయి. ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పేదరికం తాండవించింది.