అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న? | SS Rajamouli–Mahesh Babu’s SSMB 29 Shooting in Kenya: A Pan-World Action Adventure | Sakshi
Sakshi News home page

SSMB in Kenya: అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?

Sep 3 2025 4:51 PM | Updated on Sep 3 2025 5:10 PM

This Is The Reason Rajamouli Choose Kenya For SSMB29

ఎస్‌ఎస్‌ రాజమౌళి.. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్‌ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం.. భావోద్వేగ దృశ్యవిచిత్రమే. భారీ స్థాయిలో నిర్మాణం.. అద్భుతమైన హీరోయిజం.. హైస్టాండర్డ్‌ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆయన చెక్కే చిత్రాలు.. ప్రపంచం మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేశాయి. అయితే పాన్‌ ఇండియా నుంచి పాన్‌ వరల్డ్‌పై ఇప్పుడు ఆయన దృష్టి పడింది.

జక్కన్న ఇప్పుడు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో (SSMB 29) ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో షూటింగ్‌ చేసుకుంటోందీ చిత్రం. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్‌ మర్యాదపూర్వకంగా కలిస్తే.. ఆసక్తికర విషయాన్నే ఆయన తెలియజేశారు.

రాజమౌళి రెండు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, దృశ్యాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి 120 మందితో కూడిన రాజమౌళి టీమ్‌ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్‌ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.

సుమారు 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్‌ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది అని ట్వీట్‌ చేశారాయన. సో.. మహేష్‌ సినిమాతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారన్నమాట. మరి అంతగా ఆయన్ని ఆకర్షించిన విషయాలు అక్కడేం ఉన్నాయి?..

కెన్యాలోని మసాయి మరా, లేక్ నైవాషా, అంబోసెలీ నేషనల్ పార్క్.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, వన్యప్రాణి, సఫారీ గమ్యస్థానాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..

మసాయి మరా నేషనల్ రిజర్వ్ (Masai Mara National Reserve).. బిగ్‌ ఫైవ్‌కు ఆవాసం. అంటే.. సింహం, చిరుతపులి, ఏనుగు, గేదె, రైనోలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో లక్షలాది వన్యప్రాణులు (విల్డీబీస్ట్, జెబ్రాలు) టాంజానియాలోని సెరెంగెటి నుంచి మసాయి మరాకు వలస వస్తాయి.సుమారు 500కి పైగా పక్షుల జాతులు ఆవాసం ఉన్నట్లు అంచనా. ఉదయం, సాయంత్ర వేళల్లో గేమ్ డ్రైవ్‌లు ద్వారా వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.

అంబోసెలీ నేషనల్ పార్క్ (Amboseli National Park).. ఆఫ్రికాకు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంగా పేరున్న కిలిమంజారో పర్వతశ్రేణి నేపథ్యంగా కనిపిస్తుంది ఈ పార్క్‌. ఆఫ్రికన్‌ ఏనుగుల గుంపులకు ఇది ఎంతో ప్రసిద్ధి. సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు అనేక ఇతర జాతులు కనిపిస్తాయి. పొడి ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి నీటి వనరులు వన్యప్రాణులకు ఆకర్షణగా నిలుస్తాయి.

లేక్ నైవాషా (Lake Naivasha).. అనేక రకాల పక్షులు, నీటిలో నివసించే వన్యప్రాణులతో ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ప్రైవేట్‌ అభయారణ్యం.. క్రెసెంట్‌ ఐల్యాండ్‌లో జిరాఫీ, జీబ్రాలు, ఇతర మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. దీంతో ఫొటోగ్రాఫర్లు, నేచర్‌ లవర్స్‌కి ఇదొక స్వర్గధామం. నైవాషా ఐకానిక్‌ సరస్సులో హిప్పోలు(నీటి ఏనుగులు), పక్షుల రాకపోకలతో కనువిందు చేసే దృశ్యాలను చూడటానికి బోటు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ మూడింటితో పాటు అరుదైన జాతుల వన్యప్రాణుల ఆవాసం సంబురు (Samburu)లోనూ చిత్రీకరణ జరగవచ్చని తెలుస్తోంది. గ్రెవీస్ జెబ్రా (Grevy's Zebra), సోమాలీ ఆస్ట్రిచ్ (Somali Ostrich), రెటిక్యులేటెడ్ జిరాఫీ (Reticulated Giraffe), బేసియా ఒరిక్స్ (Besia Oryx), గెరెనుక్ (Gerenuk) ఈ ఐదు అరుదైన జాతుల వల్ల ఈ ప్రాంతాన్ని ‘సంబురు స్పెషల్ ఫైవ్’ అని పిలుస్తారు. వన్యపప్రాణి పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు ఇది వరల్డ్‌ ఫేవరెట్‌ స్పాట్‌గా పేరుంది.

భారతీయ చిత్ర పరిశ్రమ.. కెన్యా అడవులను ప్రధాన లొకేషన్‌గా ఎంచుకోవడం ఇదే మొదటిసారి!!. పైగా మసాయి మరా, అంబోసెలీ, లేక్ నైవాషా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో నిండి కెన్యా సఫారీకి ఇవి ఒక కంప్లీట్‌ ప్యాకేజీగా ఉన్నాయి. దీనికి తోడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఒక రగ్డ్ ఎక్స్‌ప్లోరర్‌ రోల్‌లో కనిపిస్తారని.. అరుదైన ఔషధం కోసం వెతుకుతూ అడవుల్లో ప్రయాణిస్తారనే స్టోరీ లైన్ఒకటి తెరపైకి వచ్చింది. సో.. తరహా కథకు పురాతనమైన.. మనిషి నియంత్రణలో లేని అడవులు(అన్టేమ్డ్‌) అవసరమని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. పైగా కెన్యా లాంటి దేశం భారతీయ సినిమాకు కొత్త వేదికగా నిలవడమే కాకుండా పాన్వరల్డ్ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా. మొదట్లోనే చెప్పుకున్నట్లు.. లార్జర్దెన్లైఫ్అనిపించాలంటే విలక్షణమైన కెన్యా దేశపు లొకేషన్‌లు ఈ విజన్‌కు సరిపోతాయి అని జక్కన్న ఫిక్స్‌ అయి ఉండొచ్చు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement