Palestina: 75 ఏళ్లయినా.. గుండెల్లో అవే గుర్తులు, ఇంటికి తిరిగి రాగలమా?

Palestina: They have hope to return their homes even after 75 years - Sakshi

పాలస్తీనా శరణార్థుల దీన గాధలు

మే 15, 1948న ఖాళీ అయిన గ్రామాలు

75 ఏళ్లుగా వెంటాడుతున్న పీడకలలు

మిడిల్ ఈస్ట్ లో ఇంకా చల్లారని ఉద్రిక్తతలు

గురక శబ్దం కఠోరంగా వస్తోంది. గాఢ నిద్రలో ఉన్నాడు. క్షణంలో తేడా. ఒక భారీ ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు. ఓ పీడ కల తనను విడిచిపెట్టనంటోంది. నిశి రాత్రి నుంచి సూర్యోదయం వరకు మళ్లీ కంటి మీద కునుకు రాలేదు. ఇలాంటి నిద్ర లేని రాత్రులు యాకుబ్‌కు ఎన్నో ఉన్నాయి. 

పుట్టి పెరిగిన గడ్డ నుంచి తననెందుకు తరిమెశారో తెలియని దుస్థితి యాకుబ్‌ది. ఒక్క యాకుబే కాదు ఏడున్నర లక్షల మందిది ఇదే పరిస్థితి.

 

పాలస్తీనాలోని ఓ చిన్న పల్లె యాకుబ్ ది. అక్కడ దాదాపు వంద ఇళ్లుంటాయి. పచ్చటి కొండను ఆనుకుని కట్టుకున్న రాతి ఇళ్లను దూరం నుంచి చూస్తే.. ఓ అందమైన కాన్వాస్‌లా కనిపిస్తుంది. కానీ ఆ పరిస్థితి 1948 వరకే. ఒక్క ఈ ఊరే కాదు. పక్కనే ఉన్న బోలెడు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు పిల్లాపాపలతో కళకళలాడిన ఊళ్లన్నీ ఖాళీ అయ్యాయి. అప్పటివరకు రాజులా బతికిన వాళ్లంతా శరణార్థులుగా మారిపోయారు. ఈ దుస్థితినే వాళ్లు నక్భా అంటారు. దానర్థం తరిమేయడం.

1948లో ఇజ్రాయిల్‌ ఏర్పాటు తర్వాత పాలస్తీనాలో చాలా ఊళ్లు నిర్మానుష్యమయ్యాయి. కనిపించిన వాళ్లందరనీ తరిమేశారని యాకుబ్‌ లాంటి వాళ్లు చెబుతుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా.. తన సొంత గడ్డను చూసుకోడానికి వస్తారు. ప్రతీ ఏటా ఇక్కడికి వచ్చే యాకుబ్‌లో ఇంకా ఆశ మిణుకు మిణుకు మంటూనే ఉంది. 

ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన ఈ ఊళ్లు .. ఇప్పుడు ఓ రిజర్వ్‌ ప్రాంతాలుగా మారిపోయాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటి మధ్య ఇంకా అందంగా కనిపిస్తోన్న ఆనాటి రాతి కట్టడాలు.. ఇవే యాకుబ్‌ లాంటి వారికి ఆక్సిజన్‌. 75 ఏళ్ల కిందినాటి తీపి గుర్తులను నెమరేసుకుంటూ జీవితాన్ని సాగదీస్తున్నారు. కనిపించిన వాళ్లందరికీ.. ఇదే నా ఇల్లు, ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే ఆడుకున్నాను అంటూ చూపిస్తాడు యాకుబ్‌. 

"1948లో అందరం ఇళ్లలో ఉన్నాం. ఒక్కసారిగా బాంబులు పేలాయి. ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. ఇల్లు, వాకిలి, మంచి జీవితంతో రాజులా ఉన్న మేం.. ఒక్క గంట తేడాలో మేం శరణార్థులుగా మిగిలిపోయాం. మా ఇంటి నిండా భోజనం, మంచి దుస్తులు ఉండేవి. కానీ శరణార్థి క్యాంపుల్లో మాకు కనీసం కడుపు నిండా తినేందుకు లేని రోజులు ఎన్నో ఉండేవి. వేసుకోడానికి మంచి దుస్తులు లేక చలికి అల్లాడిపోయేవాళ్లం" అంటాడు యాకుబ్‌.

ఏదో ఒక రోజు మా ఇంటికి మేం తిరిగి వస్తామన్న ఆశ యాకుబ్‌లో మిగిలి ఉంది. చచ్చిపోయేలోగా అది నెరవేరాలన్నది యాకుబ్‌ కల. 1948లో ఈ ఏరివేత జరిగినపుడు లక్షలాది కుటుంబాలు తమ వాళ్లను కోల్పోయాయి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు దేశాల్లో ఏర్పాటు చేసిన శరణార్థుల శిబిరాల్లో లక్షలాది మంది అష్టకష్టాలు పడ్డారు. 

ప్రాంతం శరణార్థులు క్యాంపులు
గాజా 14,80,000 8
వెస్ట్ బ్యాంకు 8,72,000 19
సిరియా 5,69,000 12
లెబనాన్ 4,80,000 12
జోర్డాన్ 23,07,000 10

నక్బా ఘటనలకు మే 15తో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాటి సంఘటనలకు, ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top