
గోమా: కాంగోలో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)అనుబంధ ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 60 మంది ప్రజలు చనిపోయారు. సోమవారం రాత్రి నార్త్ కివు రాష్ట్రంలోని ఎన్‌టొయోలో శ్మశాన వాటిక వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. అలైడ్ డెమోక్రాటిక్ ఫోర్స్(ఏడీఎఫ్) ఉగ్రమూకలు పొడవాటి కత్తులతో అక్కడికి చేరుకుని, జనాన్ని ఒక చోటకు చేరుకోవాలని హుకుం జారీ చేశారు. వారందరీ తలలను కత్తులతో నరికేశారు. కనీసం 60 మంది ఈ ఘటనలో చనిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని ఆ ప్రాంత అధికారి ఒకరు తెలిపారు. కాంగో–ఉగాండా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో ఏడీఎఫ్ దారుణాలకు తెగబడుతోంది. జూలైలో ఈ గ్రూపు ఇటురి ప్రావిన్స్‌లోని కొమండాలోని చర్చిపై జరిపిన దాడిలో 34 మంది, అంతకుముందు ఇరుములో జరిపిన దాడిలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.