శ్వేతసౌధాన్ని వీడిన ట్రంప్‌

Donald Trump Leaves White House For Last Time - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన రిపబ్లికన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధాన్ని వీడారు. మరికొన్ని గంటల్లో డెమొక్రాట్‌ జో బైడెన్‌ అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న వేళ వైట్‌హౌజ్‌ సిబ్బందికి ట్రంప్‌ దంపతులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ నాలుగేళ్లు ఎంతో గొప్పగా గడిచాయి. మనమంతా కలిసి ఎన్నో సాధించాం. నా కుటుంబం, స్నేహితులు, నా సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు. మీరెంత కఠినశ్రమకోర్చారో ప్రజలకు తెలియదు. అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితకాలంలో లభించిన గొప్ప గౌరవం. అందరికీ గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నా’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు.(చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్‌)

అదే విధంగా.. ‘‘మనది గొప్ప దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి. కరోనా మహమ్మారి మనల్ని దారుణంగా దెబ్బకొట్టింది. అయినప్పటికీ మనమంతా కలిసి వైద్యపరంగా ఒక అద్భుతమే చేశాం. తొమ్మిది నెలల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసుకున్నాం’’ అని ట్రంప్‌ తమ హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి చెప్పుకొచ్చారు. ఇక కొత్త పాలనా యంత్రాంగానికి ఆల్‌ ద బెస్ట్‌ చెప్పిన ట్రంప్‌.. ‘‘మీకోసం(ప్రజలు) ఎల్లప్పుడూ నేను పాటుపడతాను. ఈ దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కొత్త ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాలి’’ అని సందేశం ఇచ్చారు. కాగా తన సతీమణి మెలానియా కలిసి ఎర్రటి తివాచీపై నడుచుకుంటూ వచ్చిన ట్రంప్‌.. మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌లో ఎక్కి ఎయిర్‌బేస్‌కు బయల్దేరారు. అక్కడి నుంచి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ఫ్లోరిడాకు చేరుకోనున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top