ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాల్లో మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ల పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి 19,638 మంది విద్యార్థులకు 19,099 మంది (97 శాతం) హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐఈఓ, చీఫ్ సూపరింటెండెంట్ సునీత, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్‌లో 262 మంది గైర్హాజరు..
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం 5,680 మంది విద్యార్థులకు 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. ఇదిలాఉండగా.. నేటి(గురువారం) నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హనుమకొండ జిల్లాలో
97 శాతం విద్యార్థుల హాజరు


