క్రీడలతో ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్‌గౌడ్ విద్యార్థులకు సూచించారు. 69వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు హనుమకొండ ప్రభుత్వ పాఠశాల మైదానంలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే పోటీలకు డీఈఓ గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన ప్రతి ఆటను ఓ మెట్టుగా మలుచుకుని విజయం వైపు పయనించాలని సూచించారు. విశిష్ట అతిథి, యువజన కాంగ్రెస్ నాయకుడు విష్ణురెడ్డి మాట్లాడుతు బాక్సింగ్ ఆత్మరక్షణకే కాకుండా సమాజంలో బాక్సర్లకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. ఎస్‌జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వి. ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, రెఫరీలు పాల్గొన్నారని తెలిపారు. క్రీడాకారులకు భోజన, ఇతర వసతులు కల్పించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని గుణలో జరగనున్న ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, కార్యదర్శి మల్లారెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి మంచాల స్వామిచరణ్, భూపాలపల్లి డీవైఎస్‌ఓ చిర్ర రఘు, ఆర్మీ రిటైర్డ్ అధికారి శీలం నరేంద్రదేవ్, కోచ్‌లు ప్రభుదాస్, శ్యాంసన్, శ్రీకాంత్, రెఫరీలు వేణు, కుమార్, సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి గిరిరాజ్‌గౌడ్
హనుమకొండలో రాష్ట్రస్థాయి
బాక్సింగ్ పోటీలు ప్రారంభం
ఉమ్మడి 10 జిల్లాల నుంచి 150
మంది క్రీడాకారులు హాజరు


