ప్రయోగాలకే పరిమితం!
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్లు మారిన ప్రతీసారి వారు అమలు పారిశుద్ధ్య నిర్వహణ విధానాలూ మారుతున్నాయి. ఒక కమిషనర్ రూపకల్పన చేసిన విధానాలను మరో కమిషనర్ లెక్క చేయడం లేదనే ఆరోపణ లున్నాయి. వీరి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా అమల్లో ఉన్న నిబంధనలకు పదును పెట్టి మరిన్ని ఫలితాలు సాధించాలి. కానీ, రూ.కోట్లు వెచ్చించి చేసిన ప్రయోగాలు విఫలమవుతున్నాయి.
2012 నుంచి అదే వరుస..
సుప్రీం కోర్టు 2001లో చెత్త ప్రక్షాళన నిబంధనావళి (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) మార్గదర్శకాలను జారీ చేసింది. 2012 అక్టోబర్ 10–17 తేదీల్లో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ క్లిన్ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెత్త రెడ్యూస్, రీయూజ్, రీ సైక్లింగ్ చేపట్టారు. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ చేపట్టారు. డస్ట్‌బిన్ లెస్ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలను జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టగలిగారు. బాలసముద్రంలో బయోగ్యాస్ గ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు నెలకొల్పారు. విద్యుత్‌తోపాటు సేంద్రియ ఎరువు ఉత్పత్తికి అంకురార్పణ చేశారు. ఈనేపథ్యంలో నగరానికి పెద్ద ఎత్తున అవార్డులు, ప్రశంసపత్రాలు లభించాయి. దేశ వ్యాప్తంగా నగరాల దృష్టి వరంగల్‌పై పడింది.
‘క్లీన్ సిటీ.. అగ్లీ సిటీగా మారింది’
2013 తర్వాత అది కాస్తా తిరోగమన దిశగా పయనించింది. కమిషనర్‌గా జి.సువర్ణ పండాదాస్ వచ్చారు. నగరంలో క్లిన్‌సిటీ వాస్తవ పరిస్థితులను పరిశీలించి క్లిన్‌సిటీ అగ్లీసిటీగా మారిందన్నారు. విజయవాడలో రూపొందించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రూపొందించాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త కాకుండా అంతా సేకరించాలని ఆదేశాలిచ్చారు. నగర వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని, డస్ట్‌బిన్ డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో క్లిన్‌సిటీ నిర్ణయాలు నిరూపయోగమయ్యాయి.
మారుతున్న కమిషనర్లు, ప్రణాళికలు
తొలుత తోపుడు బండ్లు, రిక్షాలు, ఇప్పుడు స్వచ్ఛ ఆటోలు ఇలా.. కమిషనర్లు మారినప్పుడల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పొడి చెత్త సేకరణ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. డీఆర్‌సీసీ సెంటర్లు మాత్రం విజయవంతంగా నడుస్తున్నాయి. రోడ్ల వెంట డస్ట్ బిన్లకు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారు. ఇవి మచ్చుకు కూడా కనిపించట్లేదు. వరంగల్ గోపాలస్వామి దేవాలయం బస్ స్టాప్, హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కరీంనగర్ రోడ్డులోని పోలీస్ కమిషనరేట్ ప్రహరీ పక్కన రూ. 17లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన భూగర్భ డస్ట్ బిన్‌లు కాలగర్బంలో కలిపోయాయి. వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్‌లోని బల్దియా షెట్టర్లలో ఆర్గానిక్ కంపోస్ట్ ఎరువు పరికరాలు రూ.11 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఇవీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇలా చెత్తశుద్ధీకరణ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడం, కమీషన్ల పాలైందనే ఆరోపణలున్నాయి.
చెత్త ప్రక్షాళనపై ఫోకస్ పెట్టాలి..
మూడు నెలల కిందట పాలక వర్గం పెద్దలు, అధికార యంత్రాంగం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, రాజస్తాన్‌లోని జైపూర్ సిటీలో పర్యటించి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు పరిశీలించారు. ఇటీవల కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ గోవాను సందర్శించి, అక్కడి విధానాలు పరిశీలించారు. 2012 క్లీన్ సిటీ కార్యక్రమం తరహాలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అమలు చేయాలనే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో చెత్త ప్రక్షాళనపై కమి షనర్, మేయర్ ఫోకస్ పెట్టాలని, గ్రేటర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని నగరవాసులు కోరుతున్నారు.
ఫలితాలు నామమాత్రం
విధానాల మార్పుతో
ప్రజాధనం దుర్వినియోగం
అభివృద్ధి పనుల్లో కొరవడిన శాసీ్త్రయత
గ్రేటర్ కమిషనర్లది
ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు
ఇది జేపీఎన్ రోడ్డు నిర్మల మాల్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై డ్రెయినేజీ. ఆరు నెలల నుంచి పొంగి పొర్లుతోంది. ఫలితంగా మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దుర్వాసనతో ముక్కుమూసుకుని నడవాల్సిన పరిస్థితి. ఈప్రాంతంలో వ్యాపారం చేసుకునే వారు. పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై పలుమార్లు స్థానికులు బల్దియా గ్రీవెన్స్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతిపత్రాలు అందించారు. మంత్రి కొండా సురేఖ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ‘మా సెక్షన్ కాదు.. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారిది’ అని బల్దియా అధికారులు చెబుతుండగా.. తమ పరిధిలోకి రాదని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.
ప్రయోగాలకే పరిమితం!
ప్రయోగాలకే పరిమితం!


