నిఘా నీడలో కలెక్టరేట్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో భద్రతా నిఘాను కలెక్టర్ మరింత కట్టుదిట్టం చేశారు. అధికారుల విధి నిర్వహణతోపాటు కలెక్టరేట్‌కు వచ్చిపోయే వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రాంగణమంతటా సీసీ కెమెరాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గతంలో ప్రధాన ప్రాంతాలు, రోడ్ల వెంట వచ్చేపోయే వారిని గమనించేందుకు సుమారు 30 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా.. తాజా ఏర్పాట్లతో మొత్తం సీసీ కెమెరాల సంఖ్య 78కి పైగా చేరనున్నట్లు సమాచారం. కలెక్టరేట్ చుట్టూ పరిసరాలకే పరిమితం కాకుండా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్‌ఓ చాంబర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది కార్యాలయాలు వంటి కీలక విభాగాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా కూడా నిఘా వ్యవస్థను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిసింది.
ఆదర్శంగా కలెక్టర్ నిర్ణయం
నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే విషయంలో కలెక్టర్ తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పైస్థాయి నుంచి క్రమశిక్షణ మొదలవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది.
ఇక ఆలస్యానికి తావులేదు..
కలెక్టరేట్‌లోని కొన్ని విభాగాల్లో సిబ్బంది సమయపాలనపై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాత విధులకు హాజరుకావడం, సాయంత్రం త్వరగా కార్యాలయాలు విడిచిపెట్టడం వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పర్యవేక్షించాల్సి న కొంతమంది అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఘాను మరింత కట్టుదిట్టం చేయడంతో ఇటువంటి వ్యవహారాలకు ఇక చెక్ పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు తదితర క్రమశిక్షణ చర్యలతో గాడిన తప్పిన వ్యవస్థను సరిచేస్తున్న కలెక్టర్.. తాజా నిఘా చర్యలతో పనితీరును మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఉద్యోగుల సమయపాలన కూడా గాడిన పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలెక్టర్, అదనపు కలెక్టర్,
డీఆర్డీఓ చాంబర్లలోనూ సీసీ కెమెరాలు
అధికారుల విధులు, కార్యాలయానికి వచ్చివెళ్లే వారిపై పర్యవేక్షణ


